కేసీఆర్‌ను సీఎంగా చెప్పుకోవడానికి జనం సిగ్గుపడుతున్నారు: షర్మిల

by Shyam |
YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో నీళ్లు, నిధులు నియామకాలన్నీ కేసీఆర్ ఇంటికి మాత్రమే దక్కాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. ఇందిరా పార్క్ వద్ద బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 7,651 ఫీల్డ్ అసిస్టెంట్లను తొల‌గించ‌డం అన్యాయమని అన్నారు. ఉద్యోగాలు పోయాయ‌న్న బాధ‌తో ఇప్పటివరకు 50 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రాణాలు విడిచారన్నారు. అధికార పార్టీ లీడ‌ర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు బాగా సంపాదించుకున్నారని చెప్పడం దుర్మార్గమని ఆమె మండిపడ్డారు.

రాష్ట్రంలో సంపాదించుకున్న వ్యక్తులెవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్, ఆయ‌న‌ కుటుంబం మాత్రమేనని విమర్శలు చేశారు. కాళేశ్వరం రీడిజైనింగ్, మిష‌న్ భ‌గీర‌థ పేరుతో నిస్సిగ్గుగా వేల కోట్లు క‌మీషన్లు తిని, ఫాం హౌజ్‌లో దాచిపెట్టుకున్నారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో తెలంగాణ సాధించుకుంటే నేడు నీళ్లు కేసీఆర్ ఇంటికి, నిధులు ఫాం హౌజ్‌కు, నియామ‌కాలు ఆయన కుటుంబానికే చెందాయని చురకలంటించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలకు భరోసా ఇవ్వని అస‌మ‌ర్థ నాయ‌కుడు కేసీఆర్‌ అని మండిపడ్డారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఏం తప్పు చేశార‌ని వారిని తొల‌గించారని ఆమె ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు వస్తున్న రూ.9 వేలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని, జీతాలు పెంచాల‌ని అడ‌గ‌డం తప్పా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఒక‌ప్పుడు కేంద్రంలో కార్మిక‌శాఖ మంత్రిగా ప‌నిచేసినా.. ఆయనకు కార్మికుల అవ‌స‌రాలు మాత్రం ప‌ట్టవని అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆమె విమర్శలు చేశారు. ప్రజల గురించి ఆలోచించ‌ని సీఎం ఎందుకని, ఆయన కుటుంబానికి ఐదు ఉద్యోగాలు అవ‌స‌రం లేదన్నారు.

Sharmila

మొన్నటికి మొన్న ఆర్టీసీ స‌మ్మెను కేసీఆర్ నిర్వీర్యం చేసి కార్మికుల చావుల‌కు కార‌ణ‌మ‌య్యారని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. క‌రోనా స‌మ‌యంలో 1,600 మంది నర్సుల సేవ‌ల‌ను ఉప‌యోగించుకుని, రాత్రికి రాత్రే విధుల నుంచి తొలగించారని అన్నారు. 675 మంది నర్సులు ఉద్యోగాల‌కు ఎంపికైతే వారికి ఇప్పటివరకు పోస్టింగులు ఇవ్వకుండా కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యుల‌ర్ చేస్తామ‌ని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వ‌చ్చాక 52వేల ఉద్యోగాల‌ను తొల‌గించి రెండు లక్షల మందిని రోడ్డున ప‌డేలా చేశారన్నారు. నేడు కేసీఆర్ ను ప్రశ్నించడం కాదు క‌దా ఆయ‌న అపాయింట్ మెంట్ కూడా దొర‌క‌డం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలే ఆయన అపాయింట్ మెంట్ కోసం బిచ్చమెత్తుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి అని చెప్పుకోడానికి తెలంగాణ ప్రజలు సిగ్గుతో త‌లదించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఉపాధి ప‌నులు అంద‌రికీ చేరాల‌ని వైఎస్సార్ ఎంతోమందికి ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు క‌ల్పించారని షర్మిల గుర్తుచేశారు. అడ‌గ‌క‌ముందే ఎమ్మెల్యేల‌కు ల‌క్షల లక్షల జీతాలు పెంచిన కేసీఆర్‌కు ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ‌లు పట్టవా అని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆటలు ఇక సాగవని, ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు తాము వచ్చామని ఆమె హెచ్చరించారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మ‌హిళల కోసం పోరాటం చేస్తామని తెలిపారు. భవిష్యత్ లో అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ తెలంగాణ పార్టీయేనని, అంద‌రికీ బంగారు భ‌విష్యత్ ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. మ‌ర‌ణించిన ఫీల్ట్ అసిస్టెంట్ కుటుంబ‌స‌భ్యుల‌కు ఉద్యోగాలు క‌ల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు.

మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు రూ.25వేలు అందజేత

లోటస్ పాండ్ లో మృతిచెందిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాల‌కు రూ.25వేల చొప్పున వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఆర్థికసాయం అందజేశారు. పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్ తొమ్మిది కుటుంబాలకు రూ.25 వేలు చొప్పున ఒక్కో కుటుంబానికి అందించారు. భవిష్యత్‌లో కూడా బాధిత కుటుంబాలకు అండ‌గా ఉంటామ‌ని ఆయన భ‌రోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి ఇందిరా శోభ‌న్, బాధిత కుటుంబీకులు పుష్పలత, మాధ‌వి, మ‌హ‌మ్మద్ రేష్, క‌స్తూరి లావ‌ణ్య, ప‌ద్మ, స్వరూప, న‌రేశ్, సువ‌ర్ణ, ఆత్రం సుమిత్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed