ఓయోలో ఉద్యోగులకు భలే ఛాన్స్

by Harish |
ఓయోలో ఉద్యోగులకు భలే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్న ప్రముఖ ఆన్‌లైన్ హోటల్ రూమ్స్ బుకింగ్ సంస్థ ఓయో సరికొత్త నిర్ణయం తీసుకుంది. తక్కువ కాలంలో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈ సంస్థ ఇటీవల భారీ నష్టాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వేల ఉద్యోగాలను తొలగించింది. అయితే, సరికొత్త నిర్ణయంతో మళ్లీ పుంజుకోవడానికి సిద్ధమైంది. ఓయోలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా, సంస్థలో పనిచేస్తున్నప్పుడే కాకుండా, తర్వాత కూడా ఓయోను తమ సొంత కంపెనీగా భావించేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకమీద, ఓయోలో పనిచేసే ఉద్యోగులందరూ సహ-యజమానులుగా చేసే యోచనలో ఉంది. చాలా తక్కువ ధరకే ఎంప్లాయీ స్టాక్ ఆప్ష‌న్ ప్లాన్‌(ఈఎస్ఓపీ)ల కేటాయింపుతో ఉద్యోగులూ కో-ఓనర్స్‌గా మారనున్నారు. ఓయో హోటల్స్ ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయంగా దాదాపు 80 దేశాలకు విస్తరించింది. సుమారు 17 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులున్నారు. కేవలం ఇండియాలోనే 8 వేల మంది ఉద్యోగులున్నారు. ఇటీవల వీరిలో 2,400 మందిని తొలగించారు. తాజాగా ఈఎస్ఓపీ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. దీనికోసం రూ. 130 కోట్ల నిధులను కేటాయిస్తున్నామని ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో తెలిపినట్టు సమాచారం. ఈఎస్ఓపీ పథకాన్ని కంపెనీ బోర్డు సభ్యుల అనుమతితో పాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ అనుమతి అవసరముంది. అన్ని అనుమతులు లభిస్తే ఇకమీదట ఓయోలో పనిచేసే ఉద్యోగులందరూ ఆ సంస్థకు కో-ఓనర్స్‌గా మారనున్నారు.

Advertisement

Next Story