ఊరు పొమ్మంది.. పడవ రమ్మంది !

by Sujitha Rachapalli |
ఊరు పొమ్మంది.. పడవ రమ్మంది !
X

దిశ వెబ్ డెస్క్: కరోనా రోజురోజుకు వ్యాప్తి చెందుతూ.. వేలాది ప్రాణాలను బలి తీసుకుంటోంది. కరోనా మహమ్మారికి ప్రపంచమే విలవిల్లాడిపోతోంది. కరోనా కలవరంతో.. ప్రజలంతా వణికిపోతున్నారు. డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలును పాటిస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో మానవతా థృక్పథాన్ని మరుస్తున్నారు. ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. అనుమానంతో వారిని దేశద్రోహులుగా చూస్తున్నారు. మామూలు అనారోగ్యం వచ్చినా.. అనుమానంతో.. కరోనా లెక్కల్లో వేసేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఘోరంగా అవమానిస్తున్నారు. కరోనా భయంతో… ఓ వృద్దుడ్ని వెలివేసిన ఘటన పశ్చిమబెంగాల్ లోని నవద్వీప్ అనే గ్రామంలో జరిగింది.

కరోనా వ్యాప్తి చెందుతున్నప్పటి నుంచి .. ఎవరైనా పబ్లిక్ గా తుమ్మాలంటేనే భయపడ్డారు. దగ్గాలంటేనే ఆలోచించారు. ప్రజల్లో అంతగా అనుమానం పెరిగిపోయింది. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదే. కానీ ఇతరుల కోణం నుంచి కూడా ఆలోచించాలి. సాటి మనిషిగా వ్యవహరించాలి. కానీ కరోనా కాలంలో అవేవి తమకు పట్టవన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. చాలా మంది అనుమానంతో ప్రజలను ఇబ్బందిపెట్టేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నవద్వీప్ అనే గ్రామంలో నిరంజన్ హల్దార్ అనే వ్యక్తికి కాస్త అనారోగ్యంతో జ్వరం వచ్చింది. దీంతో 14 రోజులు క్వారంటైన్‌లోకి వెళ్లాలని వైద్యులు సలహా ఇచ్చారు. గ్రామస్థులు కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని అతనిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు… ఊళ్లోకి రాకూడదని ఏకంగా శాసనం చేశారు. దీంతో అతనికి ఏమీ తోచక గత ఐదు రోజులుగా చిన్న కాలువలోని పడవలోనే జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన హబీద్‌పూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో గ్రామంలోకి ప్రజలు రాకూడదని తేల్చి చెప్పారు. గ్రామంలోకి వస్తానని ఆయన గ్రామస్థులను వేడుకోగా… అందుకు వారు ససేమిరా అంగీకరించడం లేదు. దీంతో ఆయన పడవలోనే నివసిస్తున్నాడు.‘‘కోవిడ్ – 19 వ్యాప్తి తర్వాత నేను జ్వరంతో బాధపడుతున్నా. గ్రామస్థులు గ్రామంలోకి రానివ్వడం లేదు. వైద్యులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సలహా ఇచ్చారు. ఏం చేయాలో తోచక నేను పడవలోనే నివసిస్తున్నా’’ అని హల్దార్ తెలిపారు. మరోవైపు దీనిపై స్థానిక అధికారులు స్పందించారు. కరోనా వైరస్ కారణంగా ఈయన కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశామని, భోజనాలు కూడా అందిస్తున్నామని తెలిపారు.

క్వారంటైన్ అంటే.. నిర్బంధంగా దూరంగా ఉండటం. వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న వ్యక్తులు ఆ వైరస్‌కు ప్రభావితమై ఉంటారనే కారణంతో బలవంతంగా నిర్బంధoలో ఉంచడం లేదా స్వీయ నిర్బంధo విధించుకోవడం దాని ఉద్దేశం. అంతేకానీ ఊరి నుంచి వెలివేయడం సరికాదన్నది మానవతా వాదుల అభిప్రాయం. ఒక వేళ కరోనా వచ్చినా.. ఆ వ్యక్తిని తాకకుండా, ఆ వ్యక్తికి దూరంగా ఉండటం వల్ల కరోనా రాకుండా అడ్డుకోవచ్చు. అతను దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది కావున… ముక్కు, నోటికి మాస్క్ ధరించాలి.

Tags: corona virus,west bengal, quarantine, covid 19, fever,

Advertisement

Next Story

Most Viewed