OLA కొత్త ప్లాన్.. 15 నిమిషాల్లోనే డెలివరీ!

by Harish |   ( Updated:2021-11-05 09:00:09.0  )
OLA  కొత్త ప్లాన్.. 15 నిమిషాల్లోనే డెలివరీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ క్యాబ్ సేవల కంపెనీ ఓలా నిత్యావసరాల డెలివరీ రంగంలోకీ ప్రవేశించనుంది. నిత్యావసరాల సరుకులు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, జంతు సంరక్షణ ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించినట్టు, రానున్న రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

కేవలం 15 నిమిషాల్లో సరుకులను అందించడం ఓలా డెలివరీ సేవల ప్రధాన లక్ష్యంగా ఉందని, ఓలా యాప్‌లోనే ‘ఓలా స్టోర్’ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. వివిధ రకాల్లో మొత్తం 2,000 రకాలైన సరుకులను అందిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఓలా కంపెనీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇప్పుడున్న ఈ-కామర్స్ కంపెనీలన్నీ ఆర్డర్ చేసిన ఒక్కరోజు తర్వాతే ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నాయి.

కానీ వినియోగదారులకు వీలైనంత త్వరగా వస్తువులను అందించేందుకు పలు కంపెనీలు తక్కువ సమయంలో డెలివరీ అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంట్లో వాడుకునే నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, వంట సామగ్రి కొన్ని నిమిషాల వ్యవధిలో డెలివరీ చేయడమే వీటి లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓలా సంస్థ సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ విభాగంలో స్విగ్గీ, డుంజో లాంటి కంపెనీలు పోటీ పడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed