క‌ట్టె విర‌గ‌దు.. పాము చావ‌దు అంటే ఇదేనేమో!

by Anukaran |   ( Updated:2020-07-23 23:49:29.0  )
క‌ట్టె విర‌గ‌దు.. పాము చావ‌దు అంటే ఇదేనేమో!
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో అట‌వీ అధికారుల పేరెత్తితే చాలు ఎమ్మెల్యేలకు, అధికారుల‌కు పొలిటిష‌న్స్‌కు మ‌ధ్య పోడు భూముల వ్య‌వ‌హారం చిచ్చు రాజేస్తోంది. పోడు భూములే జీవ‌నాధారంగా బ‌తుకుతున్న ఆదివాసీ, గిరిజ‌నుల పొలాల్లోకి అట‌వీ అధికారులు హరిత‌హారం మొక్క‌లు నాటేందుకు వెళ్తుండ‌టంతో ర‌గ‌డ మొద‌ల‌వుతోంది. త‌మ జీవ‌నాధారాన్ని దెబ్బ‌తీయొద్ద‌ని అట‌వీ అధికారుల‌ను కాళ్ల వేళ్ల ప‌డిన సంఘ‌ట‌న‌లున్నాయి. అధికారులు మా పోడు భూముల్లోకి అడుగుపెడితే చావే గ‌తి అంటూ పురుగుల మందు డ‌బ్బాల‌తో బైఠాయిస్తున్నారు. దీంతో పోడు భూముల స్వాధీనం, మొక్క‌లు నాట‌డం అనేది ఇప్పుడు జిల్లా అట‌వీశాఖ అధికారుల‌కు క‌త్తిమీద సాములా మారింద‌నే చెప్పాలి. పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన అట‌వీ అధికారుల‌పై స్థానిక టీఆర్‌ఎస్‌, గిరిజ‌న‌, ఆదివాసీ సంఘాల‌ నేత‌లు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నేరుగా ఫోన్ చేసి చెబుతున్నారు. దీంతో అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని సూచిస్తున్నా.. అధికారులు త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళ్తుండ‌టంతో ఎమ్మెల్యేల ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. అయితే పోడు భూముల్లో మొక్క‌లు నాటాల‌ని ప్ర‌భుత్వం.. నాట‌వ‌ద్ద‌ని ప్ర‌జాప్ర‌తినిధుల సూచ‌న‌ల‌తో అట‌వీశాఖ‌లో క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తున్న అధికారులు, సిబ్బంది త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అధికారులు తాము చెప్పిన‌ట్లుగా న‌డుచుకోవ‌డం లేదని, ఇటు క‌లెక్ట‌ర్‌కు, అటు శాఖ ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తూ వ‌స్తున్నారు.

క‌ట్టె విర‌గ‌దు.. పాము చావ‌దు అన్న రీతిలో ఉన్న‌తాధికారులు ఆచి.. తూచి వేచి చూస్తున్న ధోర‌ణిలోనే స్పందిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల‌కు మ‌రింత మంట పుట్టిస్తోంది. భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పొదెం వీర‌య్య‌, పిన‌పాక‌ ఎమ్మెల్యే ప్ర‌భుత్వ విప్ రేగా కాంతారావు, కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు, ఇల్లందు ఎమ్మెల్యే హ‌రిప్రియ నాయ‌క్‌, అశ్వ‌రావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌ర్‌రావులు ప‌లు స‌మీక్షల్లో పోడు భూముల స్వాధీనం విష‌యంలో అధికారుల తీరును ఎండ‌గ‌డుతూనే ఉన్నారు. ఇటీవ‌ల పంట ప్ర‌ణాళిక స‌మీక్ష స‌మావేశంలో ర‌వాణాశాఖ మంత్రి అజ‌య్‌కుమార్ స‌మ‌క్షంలోనే పోడు భూములకు ప‌ట్టాలివ్వడంలో అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేల‌కు ఈ విష‌యంలో ఏం చేయాలో అర్థం కాక‌.. ఎక్క‌డా ఈవ్య‌తిరేక‌త ఎటు మ‌ళ్లుతుందోనన్న ఆందోళ‌న వారిని వెంటాడుతోంది. అధికార వ‌ర్గాల్లో ప్ర‌భుత్వ ఆదేశాలు అమ‌లు చేయ‌డంపై ప్ర‌జాప్ర‌తినిధులు క‌క్ష్య పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇలా అటు అధికారులు..ఇటు ప్ర‌జాప్ర‌తినిధులు.. ఏళ్లుగా పోడు భూముల‌నే న‌మ్ముకుని బ‌తుకుతున్నా.. ఏటా భ‌యాందోళ‌న‌తోనే సాగుకు బ‌య‌ల్దేరాల్సి వ‌స్తోంద‌ని గిరిజ‌న‌, ఆదివాసీ రైతులు అసంతృప్తిగానే ఉండ‌టం విశేషం. ఈ స‌మ‌స్య‌కు స‌మాధానం దొరుకుతుందో లేదో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed