- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GHMCలో ఆఫర్ ముగిసింది.. ఆదాయం తగ్గింది…!
దిశ, సిటీ బ్యూరో : కరోనా కలవరం.. సిబ్బంది కొరత వంటి కారణాలతో జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ తగ్గింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో బకాయిదారులను ఆకట్టుకునేందుకు ఐదు శాతం రిబేటు ఇస్తూ అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీమ్ అమల్లో ఉన్నంతకాలం ఆశాజనకంగా కొనసాగిన కలెక్షన్ ఇప్పుడు ఒక్కసారిగా పడి పోయింది. ఒకవైపు ప్రధాన ఆర్థిక వనరు కావటం, అందులో కలెక్షన్ తగ్గటంతో అధికారులు కలవరపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కూడా రూ.1800 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకోగా, రూ.1703 కోట్ల వరకు పన్ను కలెక్షన్ అయింది. కరోనా కారణంగా ఎర్లీబర్డ్ స్కీమ్ ను ఈ సంవత్సరం మే మాసంలో అమలు చేయగా, రూ. 524 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు చేశారు.
కానీ ఈ స్కీమ్ అమలు ముగిశాక, ఒక్కసారిగా కలెక్షన్ పడిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై శనివారం నాటికి సరిగ్గా 50 రోజులు గడిచినా, ఇప్పటి వరకు వర్తమాన ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న రూ.2వేల కోట్లలో కనీసం రోజుకి కోటి రూపాయల చొప్పున రూ. 50 కోట్లయినా కూడా పన్ను వసూలు చేయలేకపోయారు. ఎర్లీబర్డ్ స్కీమ్ మే నెలాఖరుతో ముగిసిన తర్వాత జూన్ 1వ తేదీకి నుంచి ఏడో తేదీ వరకు రోజూ కేవలం కోటి రూపాయల వరకు మాత్రమే పన్ను వసూలైంది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 50 రోజులు గడిచినా, కేవలం రూ.24 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
గంతలో ఈ తరహా తక్కువ ఆస్తి పన్ను వసూలు ఎప్పుడు కాలేదని, ఇందుకు పన్ను వసూలు చేయాల్సిన బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, ఇతర సిబ్బంది మొత్తాన్ని కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ అధికారులుగా వినియోగించటం వల్లే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ తగ్గిందని, బల్దియా చీఫ్ వ్యాలుయేషన్ ఆఫీసర్ కులకర్ణి చెప్పారు. ఈ నెల 21వ తేదీ సోమవారం నుంచి కలెక్షన్ టార్గెట్లు విధించి సిబ్బంది మొత్తాన్ని క్షేత్ర స్దాయి విధులకు పంపనున్నట్లు తెలిపారు. ఆస్తి పన్ను వసూలు చేస్తేనే జీతభత్యాలు చెల్లింపులకు అవకాశముందన్న విషయాన్ని ఇప్పటికే పలు సార్లు అధికారులు వెల్లడించటంతో సిబ్బంది కూడా వసూళ్లకు వెళ్లేందుకు సిద్దమైంది.
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
క్షేత్ర స్దాయిలో ఆస్తి పన్ను వసూళ్లను పెంచుకునేందుకు, కొత్తగా నిర్మితమై, వినియోగంలోకి వస్తున్న భవనాలను ఆస్తి పన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకువచ్చే విషయంపై గతంలో కమిషనర్ స్దాయి అధికారులు తరుచూ పర్యవేక్షించేవారు. ఇక ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు. కొత్త ఆర్దిక సంవత్సరం ఎర్లీబర్డ్ స్కీమ్ అమల్లో ఉన్నన్ని రోజులు ప్రతి రోజు కలెక్షన్ ను సమీక్షించేవారు. కానీ ప్రస్తుత కమిషనర్ లోకేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏ ఒక్క రోజు సమీక్షించిన దాఖలాల్లేవు. పైగా తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్నా, నిధుల సమీకరణపై ఏ మాత్రం దృష్టి సారించటం లేదన్న చర్చ లేకపోలేదు.
ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో సహా పూర్వ కమిషనర్లందరూ కనీసం ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లోనైనా పన్ను కలెక్షన్ ను సమీక్షించేవారు. కృష్ణబాబు, సోమేశ్ కుమార్, నగరం గ్రేటర్ కాకముందు సంజయ్ జాజు లాంటి వారైతే పెద్ద మొత్తంలో బకాయిపడ్డ బకాయిదారులతో చర్చించి పన్ను కట్టించుకునేందుకు అవసరమైతే జోనల్, అదనపు కమిషనర్లను తీసుకుని నేరుగా క్షేత్ర స్దాయి విధులకు వెళ్లేవారు. కృష్ణబాబు కమిషనర్ గా ఉన్నపుడైతే దీర్ఘకాలంగా, పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారుల వివరాలను ఫ్లెక్సీలపై ముద్రించి రద్దీగా ఉండే ప్రాంతాల్లో డిస్ ప్లే చేసేవారు. దీంతో పరువు కోసమైనా బడా బాబులు స్వయంగా వచ్చి కమిషనర్ కు నేరుగా పన్ను చెల్లించేవారు. పైగా సిబ్బందికి ఇన్సెంటీవ్స్ కూడా ఇచ్చి ప్రోత్సహించేవారు. కానీ ఇప్పుడలాంటి చర్యలేమీ లేకపోవటంతో కనీసం రోజుకి కోటి రూపాయలు కూడా వసూలు కావటం లేదు.
ఆపత్కాలంలోనూ ఆస్తి పన్నును ఆపలే
ఆస్తి పన్ను చెల్లింపుల్లో నగరంలోని కొందరు బడా బాబులు, పారిశ్రామిక వేత్తలు, ప్రజాప్రతినిధులకంటే చిరు వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు, కాలనీ వాసులను ప్రశంసించాల్సిందే. ఒక వైపు కరోనా విజృంభణ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు, వ్యాపారాలు సక్రమంగా నడవక ఇబ్బందులు పడుతున్న వారు సైతం ఇంతటి ఆపత్కాలంలో ఆస్తిపన్ను చెల్లింపులను ఆపలేదు. ఎర్లీబర్డ్ స్కీమ్ కింద ఇస్తున్న ఐదు శాతం రిబేటును పక్కనబెడితే ఉన్న బకాయిని తీర్చుకుంటే మంచిదని, దీంతో టెన్షన్ ఉండదని సామాన్యులు భావించటం విశేషం.
ఎర్లీబర్డ్ స్కీమ్ తో వసూలైన మొత్తం రూ.524 కోట్లలో రూ.2 వందల కోట్ల పై చిలుకు పన్నును బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు వసూలు చేయగా, మిగిలిన మొత్తాన్ని నగర ఆస్తి పన్ను బకాయిదారులు వారంతటవారే చెల్లించినవే. ఇందులో సుమారు 58 వేల 865 ఆస్తులకు సంబంధించి రూ. 57.89 కోట్లపై చిలుకు సిటిజన్ సర్వీస్ సెంటర్లలో చెల్లించగా, 45 వేల 514 ఆస్తులకు చెందిన బకాయిదారులు సుమారు రూ. 210 కోట్లను చెల్లించగా, మిగిలిన కలెక్షన్ ఆన్ లైన్ లో వచ్చిందేనని అధికారులు తెలిపారు.