ఉపాధి కల్పనపై తలోమాట.. లెక్కలతో చిక్కులు

by Anukaran |   ( Updated:2021-12-12 22:29:03.0  )
TS iPass
X

టీఎస్ ఐపాస్ ద్వారా 15,852 కంపెనీలకు అనుమతులు ఇచ్చాం. 15లక్షల 60వేల 506 ఉద్యోగాలు లభించనున్నాయి. 12,198 యూనిట్లు ప్రారంభమయ్యాయి. 7.71లక్షల ఉద్యోగాలిచ్చాం. నిర్మాణ దశల్లో 3,654 పరిశ్రమలు ఉండగా, 7.78లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏడేళ్లలో రూ.2.15లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాం.
-జూన్ 10న ఎంసీహెచ్ఆర్‌డీలో జరిగిన పరిశ్రమల వార్షిక నివేదిక 2020-21 ఆవిష్కరణ సదస్సులో మంత్రి కేటీఆర్

13,430 యూనిట్లకు నిధులు మంజూరు చేయగా, ఉత్పత్తిని ప్రారంభించాయి. 8 లక్షల14 వేల 707 మందికి ఉద్యోగాలు లభించాయి.
-2021 సెప్టెంబర్ 30 వరకు వివరాలను పరిశ్రమలశాఖ వెల్లడి

2014లో టీఎస్ ఐపాస్ ద్వారా 17,533 కంపెనీలకు అనుమతులు ఇచ్చాం. 14వేల కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. దీంతో 16 లక్షల7 వేల 415 మందికి ఉపాధి కల్పించాం.
-2021 అక్టోబర్ 25న టీఆర్ఎస్ ప్లీనరీ ప్రగతి ఎజెండాలో ముద్రించిన వివరాలు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకోసం ఏడాదికాలంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామని పాలకులు పేర్కొంటూ అధిక పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామంటున్నారు. అయితే అధికారిక లెక్కలు ఒకలా, పరిశ్రమలశాఖ మరొకలా, పరిశ్రమలశాఖ మంత్రి ఇంకోరకంగా వెల్లడిస్తున్నారు. దీంతో ఇంతకూ వాస్తవంగా ఎన్ని పరిశ్రమలు స్థాపించి, ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించారో తెలియక రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్‌ను ప్రారంభించింది. పరిశ్రమల అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తుంది. అయితే గత ఏడేళ్లలో 17,533 పరిశ్రమలు తెలంగాణకు తరలివచ్చాయని, వీటిలో 14వేల పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించడంతో ప్రైవేటు రంగంలో 16 లక్షల 7 వేల 415 మందికి ఉద్యోగాలు లభించాయని అక్టోబర్ 25న 2021లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో సైతం పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెడుతున్నారని ప్లీనరీ సందర్భంగా ముద్రించిన సంక్షేమ జెండా.. ప్రగతి ఎజెండాలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఇది టీఆర్ఎస్ ఘనత అని.. దేశంలో ఎక్కడా లేని విధానమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వేదిక మీదా చెబుతున్న ఈ టీఎస్​ఐపాస్​స్కీమ్​ ప్రధాన ఉద్దేశం.. అనుమతుల సరళీకరణ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్​ విండో పద్ధతిలో అన్ని అనుమతులకు నిర్దిష్ట కాల పరిమితి విధింపు కారణమని తెలిపారు. టీఎస్​ఐపాస్ ద్వారా 50 రకాల సేవలు అందుతాయి. ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే రూ.200 కోట్ల లోపు ప్రాజెక్టులకు అనుమతులు 30 రోజుల లోపు, ఆ పై ప్రాజెక్టులకు 15 రోజుల్లో అనుమతులు అందేలా ఈ వ్యవస్థ ఏర్పాటైంది. అనుమతులు సరళతరం చేసినా ఆశించిన మేరకు పరిశ్రమలు రాకపోవటం గమనార్హం. పరిశ్రమల ప్రోత్సాహక విధానం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనుకూలంగా లేదన్నది ఆయా వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదు.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ స్థిరమైన పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉద్యోగ కల్పన కోసమే పరిశ్రమల స్థాపన అనుకోవడం ఒక భ్రమ. ఆ ఉద్యోగ కల్పన కూడా ప్రణాళికపరంగా లేకపోతే దుష్ఫలితాలు వచ్చే అవకాశాలే అధికం. అయితే ప్రభుత్వం మాత్రం 2021 జూన్ 2 వరకు 16,129 కంపెనీలకు అనుమతులు ఇచ్చామని, రూ.2 కోట్ల 15లక్షల 450ల పెట్టుబడులు ఆకర్షించామని, 15 లక్షల 64 వేల 804 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే పరిశ్రమలశాఖ మాత్రం 2014 జూన్ 2 నుంచి 2021 సెప్టెంబర్ 30 వరకు 13,430 యూనిట్లకు 463.12 కోట్లతో 8,14,707 మందికి ఉపాధి అవకాశాలు లభించినట్లు పేర్కొంది. టీఆర్ఎస్ ప్లీనరీలో 17,533 పరిశ్రమలతో 16లక్షల 7వేల 415 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. 2020-21 ఇండస్ట్రీ వార్షిక నివేదికలో 15,852 కంపెనీలకు అనుమతి ఇచ్చామని, 2,14,951 కోట్లతో పరిశ్రమలను స్థాపించి 15లక్షల 60వేల 506 మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 2021 జూన్2న 16,129 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, 2,15,450కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, 15లక్షల64వేల804 మందికి ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇవన్నీ ఇలా ఉంటే ఇండస్ట్రీ వార్షిక నివేదిక 2020-21లో మాత్రం స్పష్టంగా 12,382 పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభమైందని, 98,120కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 7లక్షల 71వేల 750 మందికి ఉపాధి కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే ఇంతకు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారో తెలియక యువత సతమతమవుతోంది. ఉద్యోగాల కల్పన కాకీ లెక్కలుగానే మారింది.

ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన లేక ఏడాదికిపైగా అయింది. అయినా ఎలాంటి ప్రకటన లేకపోవడం, భర్తీ చేశామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటంతో యువత అయోమయానికి గురవుతున్నారు. అసలు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు… ఎంతమందికి ఇచ్చారో అర్ధం కాక సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగాల భర్తీలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాల భర్తీ చేశామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటుంది. 16,07,415 ప్రైవేటురంగంలో ఉపాధి కల్పించామని మరో వైపు వెల్లడిస్తుంది. అయితే ప్రైవేటు రంగంలో 8,14,707 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్లు పరిశ్రమలశాఖ పేర్కొంది. ఇందులో ఎంతమందికి స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారో మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందికి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించిదో మాత్రం ఎక్కడ కూడా పేర్కొనకపోవడం గమనార్హం. హైదరాబాద్ లో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశస్తులు సైతం నివాసం, ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే స్థానిక పరిశ్రమల్లో ఎంతశాతం స్థానికులు ఉద్యోగావకాశాలు ఇచ్చారనేది మాత్రం గోప్యంగానే ఉంచారు.

టీఎస్​ఐపాస్ విధానాన్ని గానీ, ఇస్తున్న రాయితీ పథకాలను గానీ పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆయా పక్షాలు, ప్రజలతో సంప్రదింపులు జరపకపోగా, సమీకృత పారిశ్రామిక విధానం తయారు చేసే ప్రక్రియ కూడా చేపట్టలేదు. 24 గంటల కరెంటు, చార్జీలు తక్కువున్న కరెంటు, పుష్కలంగా భూమి, నీరు, రాయితీలు, సరళీకృత అనుమతుల ప్రక్రియ మొదలైనవి ఇచ్చిన తర్వాత కూడా పరిశ్రమలు ఎందుకు రావడం లేదనేదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. పెద్ద, విదేశీ పెట్టుబడిదారులు అనేక కోణాలు ఆలోచించి వస్తారు. లాభాలు తీసుకుని పోతారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పూర్తిగా వారి మీదనే ఉంది. స్థానిక పెట్టుబడుల ద్వారా స్థానిక వినియోగానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తి మీద దృష్టి లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధాన లోపం. రాష్ట్రంలో వస్తు వినిమయ విపణి మీద అవగాహన లేకపోవడం కూడా ఇంకో లోపం. దూర ప్రాంతాల నుంచి దిగుమతులు పెరుగుతున్న పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఎటువంటి పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం ఉందని ఒక్కటంటే ఒక్క అధ్యయనం కూడా చేయలేదు. ఉన్న పరిశ్రమలు దెబ్బతినకుండా, మూతపడకుండా చేయాల్సిన ప్రయత్నాలను ఈ విధానంలో సమీక్షించలేదు.

ఇదిలా ఉంటే వస్తు ఉత్పత్తి ప్రక్రియ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న తరుణంలో ఆ మేరకు సాంకేతిక సామర్థ్యం ఉన్న వ్యక్తులకే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించనున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తయారు చేసే శిక్షణ సంస్థలను ప్రభుత్వం నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే, స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఉన్నత విద్యకు, సాంకేతిక విద్యకు, పారిశ్రామికాభివృద్ధికి మధ్య అనుసంధానం చేయాల్సిన ప్రభుత్వాలు, అది మరిచిపోయి పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని భ్రమలు కల్పిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పరిశ్రమలపై రాయితీలు కాకుండా విద్యార్థి దశలోనే యువతకు నైపుణ్య శిక్షణను ఇచ్చే సంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగితాలపై కాకుండా ఉద్యోగాల కల్పన వాస్తవరూపంలో కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని నిరుద్యోగ యువత, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed