దీన్ని నివేదిక అంటారా? చెత్తకుప్పలో వేస్తాం.. సూర్యాపేట కలెక్టర్‌కు ఎన్జీటీ వార్నింగ్

by Anukaran |
Suryapeta Collector
X

దిశ, తెలంగాణ బ్యూరో : సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ ఆఫీసు పక్కనే ఉన్న కర్నాలకుంట చెరువు ఆక్రమణపై క్షేత్రస్థాయి అధ్యయనం జరిపి సమర్పించిన నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని నివేదిక అంటారా అంటూ ప్రశ్నించి చెత్త కుప్పలో వేస్తామని హెచ్చరించింది. చెరువు ఆక్రమణకు గురైనట్లు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారుచేసినా, కోర్టులో చార్జిషీటు దాఖలు చేసినా ఎలాంటి ఆక్రమణలు జరగలేదని రిపోర్టులో పేర్కొనడమే కాక ఎఫ్ఐఆర్ సంగతిని దాచిపెట్టడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించింది. చెరువు ఆక్రమణకు గురైందంటూ ధర్మార్జున్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల విచారించిన ఎన్జీటీ కలెక్టర్ అధ్యక్షతన నలుగురితో కమిటీని ఏర్పాటుచేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం పర్యావరణాన్ని ఈ విధంగానే కాపాడుతూ ఉన్నదా అని మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ రామకృష్ణన్, పర్యావరణ నిపుణులు డాక్టర్ సత్యగోపాల్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించి నివేదికను తిరస్కరించింది. కలెక్టర్ ఆఫీసు పక్కన కర్నాలకుంట చెరువు ఆక్రమణకు గురైన అంశంపై నివేదికలో సరైన సమాచారం లేదని, మరోసారి తనిఖీలు జరిపి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.

ఒక చిన్న చెరువును కలెక్టర్ బృందం రెండుసార్లు తనిఖీలు చేసి ఉల్లంఘనలేవీ లేవంటూ నివేదిక ఇవ్వడంపై పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నీళ్ల మధ్యలో నిర్మాణాలతో పాటు చెరువుగట్టును ధ్వంసం చేసిన ఫొటోలు సమర్పించినా నష్టమే జరగలేదంటూ కమిటీ పేర్కొనడాన్ని తప్పుపట్టారు. మళ్లీ తనిఖీలు చేపట్టాలని, ఆ సమాచారాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాదికి కూడా తెలియజేయాలని పేర్కొన్న ఎన్జీటీ బెంచ్ తదుపరి విచారణను నవంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story