సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

by vinod kumar |
సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఒక ఆర్మీ అధికారి సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి విషమించి ఆర్మీ అధికారి, జవాన్లు మరణించినట్టు అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతం కావడంతో పలువురు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారని, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి కాల్పులు జరిగాయని ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది.

మృతుల్లో ఏపీ సైనికుడు!

మరణించిన వారిని పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాకు చెందిన కెప్టెన్ బ్రిజేష్ థాపా, ఆంద్రప్రదేశ్‌కు చెందిన నాయక్ డీ రాజేష్, రాజస్థాన్‌కు చెందిన బిజేంద్ర, అజయ్ సింగ్‌లుగా గుర్తించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్‌ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన కశ్మీర్‌ టైగర్స్ ప్రకటించింది. కాగా, వారం రోజుల్లో జమ్ము రీజియన్‌లో జరిగిన రెండో పెద్ద ఎన్‌కౌంటర్‌ ఇది. గతవారం కతువాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. మరోవైపు 32 నెలల్లో 48 మంది సైనికులు మృతి చెందడం గమనార్హం.

అండగా ఉంటాం: రాజ్‌నాథ్‌సింగ్

ఉగ్రదాడిలో సైనికులు మరణించడంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ‘ ధైర్యసాహసాలు కలిగిన సైనికులు ఉగ్రదాడిలో వీరమరణం పొందడం బాధిస్తోంది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించడానికి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలు ఆర్మీ చీఫ్ తో మాట్లాడి తీసుకున్నారు.

ఉగ్రదాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి- రాహుల్ గాంధీ

దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కశ్మీర్‌లో ఇలాంటి భద్రతా వైఫల్యానికి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ‘కశ్మీర్‌ ఉగ్రదాడిలో ఐదుగురు అమరులయ్యారు. వారందరికి నా హృదయపూర్వక నివాళులు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. సైనికులపై ఇలాంటి దాడులు జరగడం విచారకరం. బీజేపీ తప్పుడు విధానాల భారం అక్కడి సైనికులు, ప్రజలపై పడింది. ఈ భద్రతా వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దేశ సైనికులకు హాని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed