Mallikarjun Kharge: యూపీఎస్ లో ‘యూ’ అంటే యూటర్న్స్

by Shamantha N |
Mallikarjun Kharge: యూపీఎస్ లో ‘యూ’ అంటే యూటర్న్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: యూనిఫైడ్ పెన్షన్ స్కీం(UPS) అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.యూపీఎస్‌లో ‘యూ’ అంటే.. యూటర్న్స్‌ ప్రభుత్వమని విమర్శించారు. ‘‘ జూన్‌ 4 తర్వాత మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నిర్ణయాలపై వెనక్కి తగ్గుతూ వస్తోంది. ప్రధానమంత్రి దురహంకారంపై ప్రజలు దెబ్బకొట్టారు. వక్ఫ్ బిల్లును జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి పంపింది. బ్రాడ్‌కాస్ట్‌ బిల్లును వెనక్కి తీసుకుంది. లేటరల్‌ ఎంట్రీ ప్రకటన ఇచ్చి.. విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు యూపీఎస్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రతి విషయంలోనూ కేంద్రం యూటర్న్ తీసుకుంటుంది’’ అని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ జవాబుదారీతనాన్ని కొనసాగిస్తోంది. ఈ నిరంకుశ ప్రభుత్వం నుండి 140 కోట్ల మందిని మేం రక్షిస్తాం అని ఖర్గే అన్నారు.

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్‌ సిన్హా ఈ అంశంపై స్పందించారు. తెల్లారితే మొదలు కాంగ్రెస్‌ నేతలకు అబద్ధాలు ప్రచారం చేయడమే పని అయిపోయిందన్నారు. ‘‘యూపీఎస్‌ విషయంపై ఏడాది పాటు పనిచేశాం. దీని కోసం ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథ్‌ వందలాది సమావేశాలు ఏర్పాటు చేశారు. నిపుణులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటుంది. కాంగ్రెస్‌లా తొందరపాటుతో, ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను చూస్తే పరిస్థితేంటో తెలుస్తోంది’’ అంటూ మండిపడ్డారు. ఇకపోతే, కొత్త పెన్షన్ స్కీమ్ కనీసం 10 సంవత్సరాల సర్వీసు తర్వాత సూపర్‌యాన్యుయేషన్‌పై నెలకు రూ.10 వేల కనీస పెన్షన్ హామీ వస్తుంది. ఈ పథకం 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed