ఓటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల సంఘం

by Nagaya |   ( Updated:2022-12-29 07:17:22.0  )
ఓటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల సంఘం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ఎన్నికల ప్రక్రియలో మరో అరుదైన సంస్కరణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో వలస ఓటర్లు సొంత గ్రామాలకు తరలివెళ్లాల్సిన పని లేకుండా ఎక్కడినుంచేనా తమ సొంత నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం కల్పించబోతోంది. ఈ మేరకు బహుళ నియోజకవర్గాల రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఆర్ వీఎం) నమూనాను అభివృద్ధి చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఇది ఒకే రిమోట్ పోలింగ్ బూత్ నుండి బహుళ నియోజకవర్గాలను నిర్వహించగలదని పేర్కొంది. ప్రస్తుతం తమ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు వలస వెళ్లిన వారు తిరిగి ఓటు హక్కు కలిగిన ప్రాంతానికి తప్పకుండా రావాల్సి ఉంది. ఇది ఓటర్లకు ఆర్థికంగా భారం కావడంతో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా వలస ఓటర్లు ఎన్నికల సమయంలో సొంత ఊళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడైనా ఓటు వేసే సదుపాయం ఈ సాంకేతికతతో సాధ్యం అవుతుంది. ఈ మేరకు ఆర్ వీఎం పనితీరు ప్రదర్శన కోసం వచ్చే జనవరి 16వ తేదీన రాజకీయ పార్టీలను ఈసీఐ ఆహ్వానించింది. ఈ విధానం అమలులో చట్టపరమైన, పరిపాలనా, సాంకేతిక సవాళ్లపై రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంఘం అభిప్రాయాలు సేకరించి సముచితంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కసరత్తు ప్రారంభించింది.

Advertisement

Next Story

Most Viewed