‘సాంకేతికత’ ఫలాలు అందరికీ చేరాలి.. జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

by Shamantha N |
‘సాంకేతికత’ ఫలాలు అందరికీ చేరాలి.. జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: సాంకేతిక ఫలాలు అందరికీ చేరాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇటలీలోని అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగించారు. కృత్రిమ మేధ, నెట్ జీరో, గ్లోబల్ సౌత్ సహా వివిధ అంశాలపై మాట్లాడారు. అసమానతలను తొలగించడానికి సాంకేతిక ప్రయోజనాలు అందరికీ చేరాలి అని అన్నారు. ముఖ్యంగా మానవ పురోగతికి సాంకేతికతను విస్తృత స్థాయిలో ఉపయోగించాలని సూచించారు. వివిధ రంగాల్లో సాంకేతికత పెరుగుతుందని.. సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యత అవసరమని అన్నారు. ఏఐని పారదర్శకంగా, సురక్షితంగా, బాధ్యతాయుతంగా వాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

రాబోయే కాలం ‘గ్రీన్ ఎరా’

సాంకేతికతను విధ్వంసకరంగా కాకుండా సృజనాత్మకంగా మార్చాలని ప్రపంచ దేశాలను కోరారు. రాబోయే కాలాన్ని గ్రీన్ ఎరాగా మార్చేందుకు ప్రపంచదేశాలన్నీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఐలో నేషనల్ స్ట్రాటజీని రూపొందించిన దేశాల్లో భారత్ ఒకటి అని అన్నారు. గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలు, ఆందోళనలను ప్రపంచ వేదికపై ఉంచడాన్ని భారత్ తన బాధ్యతగా పరిగణించిందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2070 నాటికి కర్భన ఉద్గారాలను సున్నాగా మార్చడమే లక్ష్యమని పిలుపునిచ్చారు. ఇంధన రంగంలో భారత్ అవెలబులిటీ, యాక్సెసబిలిటీ, అఫర్డబులిటీ, యాక్సెప్టబిలిటీ అనే నాలుగు సూత్రాలపై ఆధారపడిందన్నారు. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో శాశ్వత సభ్యదేశంగా చేయడంలో భారత్ పాత్రను ప్రధాని మోడీ గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed