తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే ఆలోచనుందా? లేదా?

by GSrikanth |
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే ఆలోచనుందా? లేదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచే ఉద్దేశం ఉన్నదా లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి వైఖరిని వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొన్నది. కేంద్రం ఇచ్చే స్పందనకు అనుగుణంగా పిటిషనర్‌ని సైతం ఆదేశించింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేసిన తీరులోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ చేయాలని ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈ నోటీసులను జారీ చేసింది.

పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించడానికి ఎందుకు జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ, పిటిషన్‌లోని అంశాలపై స్పందించడానికి మరికొంత సమయం కావాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జమ్ము కశ్మీర్ తరహాలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఆ పిటిషన్‌తో కలిపి విచారించాలని పురుషోత్తం రెడ్డి తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్రంతో రెండు రాష్ట్రాలకు పోలిక పెట్టి పిటిషన్లను కలిపి విచారించడం ఎలా సాధ్యమని ధర్మాసనం ప్రశ్నించింది. విభజన చట్టం ప్రకారమే విచారణ చేపట్టాలని వివరణ ఇచ్చారు.

విచారణ సందర్భంగా ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం, నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడంపై వివరణను కౌంటర్ అఫిడవిట్ రూపంలో సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. దీన్ని చదివి తదుపరి అభిప్రాయాన్ని (రీజాయిండర్) చెప్పడానికి పిటిషనర్‌కు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయిన ఎనిమిది వారాల తర్వాత సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ సీట్ల వ్యవహారానికి సంబంధించి నవంబరు 16, 17 తేదీల్లో విచారణ జరగనున్నది.

Advertisement

Next Story

Most Viewed