మారు వేషంలో పేషంట్‌లా వచ్చిన మహిళా ఐఏఎస్.. డాక్టర్ ప్రవర్తనతో షాక్!

by Ramesh N |   ( Updated:2024-03-19 10:48:58.0  )
మారు వేషంలో పేషంట్‌లా వచ్చిన మహిళా ఐఏఎస్.. డాక్టర్ ప్రవర్తనతో షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోగిలా మారువేషంలో వెళ్లిన ఐఏఎస్ అధికారిని యూపీ ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఐఏఎస్ అధికారిని తన ముఖాన్ని దుపట్టాతో కప్పుకుని కేంద్రంలోని ప్రజలతో ముచ్చటించారు. సెంటర్లో రోగులకు ఎదురవుతున్న అసౌకర్యాలపై పలు ఫిర్యాదులు అందటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు చేసేందుకు ఐఏఎస్ అధికారిని క్రతి రాజ్ రోగి వేషంలో వెళ్లారు. ఆమె ముఖాన్ని దుపట్టాతో కప్పి మొదట కేంద్రంలోని ప్రజలతో సంభాషించారు. సెంటర్‌లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుకున్నారు. తర్వాత ముసుగుతోనే ఆమె క్యూలో నిలబడి, డాక్టర్‌తో సంభాషించారు. తర్వాత రోగులపై డాక్టర్ ప్రవర్తన సరికాదని ఆమె గుర్తించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, రోగి సంరక్షణ పై నిర్లక్ష్యం వంటి వాటిని ఆమె గుర్తించారు. ముఖ్యంగా ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులను కనుగొన్నారు.

తర్వాత ఆమె అధికారికంగా ఆసుపత్రిని తనిఖీ చేసి.. కాలం చెల్లిన మందులను బయటకు తీయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “కుక్క కాటుకు ఇంజక్షన్ చేయడానికి ఉదయం 10 గంటల తర్వాత కూడా డాక్టర్ హాజరు కాలేదని నాకు ఫిర్యాదు అందింది. మారువేషంలో ముసుగు వేసుకుని అక్కడికి వెళ్లాను, డాక్టర్ ప్రవర్తన సరిగ్గా లేదు” అని ఐఏఎస్ క్రతి రాజ్ అన్నారు. ఫిర్యాదులను గుర్తించామని, దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు. గడువు ముగిసిన మందులను రోగులకు ఇవ్వడం లేదని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబదన్ రామ్ ప్రకటనలో స్పందించారు. ఐఏఎస్ తనిఖీ చేసి ఆస్పత్రిలో పెయింటింగ్ పని వల్ల శుభ్రంగా లేదని తెలిపారు.

Advertisement

Next Story