ప్రజలు ఎన్టీఏపై ఆగ్రహంతో ఉన్నారు..కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

by Vinod |
ప్రజలు ఎన్టీఏపై ఆగ్రహంతో ఉన్నారు..కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)(ఎన్టీఏ) పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అందుకే దానిని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తాజాగా ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎన్టీఏపై ఆరోపణలు రావడంతోనే సీనియర్ అధికారిని డైరెక్టర్ గా నియమించినట్టు తెలిపారు. అలాగే మొత్తం పరీక్షా ప్రక్రియ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. పేపర్ లీకేజీ ఘటనలపై విచారణకు సీబీఐ విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు. తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని..కానీ రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నపత్రం లీక్‌లు జరిగాయని గుర్తు చేశారు.

నీట్‌ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ..‘నీట్ ఉండకూడదనేది డీఎంకే రాజకీయ వైఖరి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్‌ జరిగింది’ అని తెలిపారు. నీట్ టాపర్ కూడా తమిళనాడుకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థే అని చెప్పారు. కోచింగ్ తీసుకోని విద్యార్థులు కూడా రాణిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సమస్యలను కూడా రాధాకృష్ణన్ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. నీట్ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం నిబద్దతతో కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసమైనా, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసమైనా పబ్లిక్ పరీక్షలకు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story

Most Viewed