Internet Ban: అసోంలో మూడు గంటల పాటు ఇంటర్నెట్ బ్యాన్.. కారణమిదే?

by vinod kumar |
Internet Ban: అసోంలో మూడు గంటల పాటు ఇంటర్నెట్ బ్యాన్.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలో ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ జరిగే సమయంలో ఇంటర్నెట్‌పై నిషేధం విధించింది. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు గ్రేడ్-3 ఉద్యోగాలకు గాను నియామక పరీక్ష జరగనుంది. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

మొబైల్ ఇంటర్నెట్, డేటా, వై-ఫై సేవలు పరీక్ష టైంలో పనిచేయబోవని తెలిపింది. అయితే వాయిస్ కాల్స్ పని చేస్తాయని స్పష్టం చేసింది. గతంలో కొందరు అభ్యర్థులు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆధారంగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్, టెలిగ్రామ్, యూట్యూబ్ తదితర వాటిని వినియోగించి అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేగాక గత కొన్ని నెలలుగా అనేక పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 2,305 కేంద్రాల్లో 11,23,204 మంది అభ్యర్థులు గ్రేడ్3 పరీక్ష రాయనున్నారు. 2022లోనూ గ్రేడ్3, గ్రేడ్ 4 పరీక్షల కోసం మొబైల్ ఇంటర్నెట్‌ని అసోం ప్రభుత్వం నిలిపివేసింది.

Advertisement

Next Story

Most Viewed