'ప్రపంచం కంటే ముందే బాలాకోట్ దాడి గురించి పాక్‌కు సమాచారం': ప్రధాని మోడీ

by S Gopi |
ప్రపంచం కంటే ముందే బాలాకోట్ దాడి గురించి పాక్‌కు సమాచారం: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: క్రితం 2019 ఎన్నికలకు ముందు సంచలనం రేపిన పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. పుల్వామా దాడికి ప్రతికారంగా భారత వాయుసేన ముష్కరులపై జరిపిన ఆ దాడి ఐదేళ్ల తర్వాత మళ్లీ కీలక అంశమైంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దాడులకు సంబంధించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బాలాకోడ్‌లో వైమానిక దాడులకు సంబంధించి పాకిస్తాన్‌కు ముందుగానే సమాచారం ఇచ్చామని, ఆ తర్వాతే మీడియాకు వెల్లడించినట్టు తెలిపారు. కర్నాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోడీ.. వెనుక నుంచి దాడి చేయడంలో మోడీకి నమ్మకం లేదని, నేరుగా ముఖాముఖి పోరాడుతామని అన్నారు. ప్రస్తుతం ఇది నవభారత్, మనకు హానీ తలపెట్టే ముష్కరులు వారి స్వంత దేశంలో దాక్కున్నా సరే వెంటాడి మరీ చంపేస్తాం. 2019 నాటి బాలాకోట్ దాడుల సమాచారం గురించి పాక్ తెలియకూడదని అనుకోలేదు. దాడి గురించి ఆ దేశానికి ముందే చెప్పామని పేర్కొన్నారు. 'ఆ సమయంలో బాలాకోట్ వైమానిక దాడుల గురించి మీడియా తెలియజేయాలని బలగాలకు చెప్పాను. దానికంటే ముందు పాకిస్తాన్‌కు విషయం చెప్పాలని భావించాను. అదేరోజు రాత్రి పాక్ అధికారులకు ఫోన్ చేస్తే వారు అందుబాటులో లేరు. ఆ కారణంగానే బలగాలను మరికొంత సమయం వేచి ఉండాలని చెప్పాను. పాకిస్తాన్‌కు విషయం గురించి చెప్పిన తర్వాతే ప్రపంచానికి తెలియజేశాం. మోడీ ఏదైనా దాచిపెట్టడు. అన్నిటినీ బహిరంగంగానే చేస్తాడని' మోడీ అప్పటి సంగతులను వివరించారు.

కాగా, 2019, ఫిబ్రవరి 13న పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను జైషే ఉగ్రవాదులు బలితీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా అదే నెల 26న భారత వాయుసేన దాడులు నిర్వహించింది. పాక్ భూభాగంలో ఉన్న జైషే ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ఘటనతో ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ సహించదని పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు సందేశమిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed