గర్భస్థ పిండ లింగ నిర్ధారణను చట్టబద్ధం చేయాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ వ్యాఖ్యలపై దుమారం

by Y. Venkata Narasimha Reddy |
గర్భస్థ పిండ లింగ నిర్ధారణను చట్టబద్ధం చేయాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ వ్యాఖ్యలపై దుమారం
X

దిశ, వెబ్ డెస్క్ : గర్భస్థ పిండం లింగ నిర్ధారణను చట్టబద్ధం చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్‌వీ అశోకన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో అశోకన్ మాట్లాడుతూ భ్రూణ హత్యల నివారణకు, లింగవివక్షత నిర్మూలనకు భారత ప్రభుత్వం 1994లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని.. 30 ఏళ్లయినా ఈ చట్టం లింగ నిష్పత్తి సమానత సాధనలో విఫలమైందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా ఈ చట్టంతో వైద్యులు ఇబ్బంది పడుతున్నారని, అబార్షన్‌కు చాలామంది బాధ్యులని, అయితే గర్భస్థ పిండం లింగ నిర్ధారణ నిషేధ చట్టం పీసీ- పీఎన్డీటీ (ప్రీ-కాన్సెప్షన్ అండ్ ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్) యాక్ట్ ప్రకారం కేవలం డాక్టర్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. లింగ నిర్ధరణ రెండు నుంచి ఐదు శాతం మంది డాక్టర్లు చేస్తారేమో, కానీ వైద్య ప్రపంచం మొత్తం ఈ కారణంగా ఇబ్బందులకు గురవుతోందన్నారు. ‘’ప్రస్తుతం ఉన్న చట్టాన్ని రద్దు చేసి, పిండం లింగాన్ని నిర్ధారించే చట్టాన్ని తీసుకురావాలని, ఆడపిల్ల అయితే, ఆమె ఈ ప్రపంచంలోకి వచ్చేలా ప్రభుత్వమే చూడాలని ఐఎంఏ సెంట్రల్ వర్కింగ్ కమిటీ రెండు వారాల కిందట ఒక ప్రతిపాదన సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. కొన్ని ప్రాంతాలలో చట్టాల కంటే సామాజిక అవగాహనే మెరుగైన ఫలితాలనిచ్చిందని అశోకన్ అభిప్రాయపడ్డారు. అశోకన్ వ్యాఖ్యలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

భ్రూణహత్యలను అరికట్టడం, లింగ వివక్షత, అసమానతలను నియంత్రించడం లక్ష్యంగా తెచ్చిన పీసీ- పీఎన్డీటీ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి 2003లో సవరించారు. పీసీ- పీఎన్డీటీ చట్టం ప్రకారం గర్భధారణ సమయంలో పిండం లింగాన్ని నిర్ధరించడం చట్టవిరుద్ధం. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష కూడా విధిస్తారు.చట్టం అమల్లో ఉన్నప్పటికిని పిండం లింగ నిర్ధారణ, అబార్షన్ వంటి చట్టవ్యతిరేక పనులు చేస్తున్న అధికారులు, వైద్యులను ఐఎంఏ ప్రెసిడెంట్ వెనకేసుకు రావడం సరికాదని మహిళా సంఘాలు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు మండిపడుతున్నారు. లింగ నిర్ధరణ పరీక్షకు చట్టబద్ధత కల్పిస్తే మహిళలు క్యూ కడతారని, గర్భిణీలు పిండాన్ని తొలగించుకునేందుకు మందులు వేసుకుని అధిక రక్తస్రావంతో చనిపోతారని లేదా అబార్షన్ చేయించుకుంటారని హెచ్చరించారు. ఇప్పుడు కూడా నకిలీ వైద్యులు అక్రమంగా నడిపిస్తున్న క్లినిక్‌లలో రహస్యంగా ఈ పరీక్షను నిర్వహించి, అబార్షన్ చేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుతో భ్రూణ హత్యలు తగ్గాయని, పలు రాష్ట్రాలలో లింగ నిష్పత్తి తేడాలు తగ్గాయంటున్నారు. 1991లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తిలో స్వల్ప మెరుగుదల కనిపించిందని, 1991లో 1,000 మంది అబ్బాయిలకు 926 మంది బాలికలు ఉండగా, 2011లో ఈ నిష్పత్తి 1,000 మంది అబ్బాయిలకు 943 మంది బాలికలకు పెరిగిందని చెబుతున్నారు. ఐఎంఏ ప్రెసిడెంట్ అశోకన్ వ్యాఖ్యలు నేరపూరిత ఆలోచనగా, వైద్యులను మాత్రమే రక్షించడానికి ప్రయత్నిస్తున్న చర్యగా విమర్శల పాలవుతోంది.

Advertisement

Next Story