తీవ్రవాద దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయి.. పాకిస్తాన్‌కు ఫరూక్ అబ్దుల్లా సీరియస్ వార్నింగ్

by karthikeya |   ( Updated:2024-10-21 09:25:42.0  )
తీవ్రవాద దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయి.. పాకిస్తాన్‌కు ఫరూక్ అబ్దుల్లా సీరియస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్‌లా మారదంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. భారత భూభాగంలో పాకిస్తాన్ చేసే తీవ్రవాద కార్యకలాపాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని గాందర్‌బల్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున) హఠాత్తుగా తీవ్రవాదుల దాడి చేసి ఏడుగురిని పొట్టన పెట్టుకున్న ఘటనపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు.

‘‘నేను పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. భారత్‌తో సత్సంబంధాలు కావాలని పాకిస్తాన్ కోరుకుంటుంటే ఇలాంటి తీవ్రవాద చర్యలకు వాళ్లు చరమగీతం పాడాలి. కాశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్‌గా మారదు. మమ్మల్ని గౌరవంగా బతకనివ్వండి. ఈ దాడి చాలా బాధాకరం. పేదలైన వలస కార్మికులు, ఓ డాక్టర్ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దాడులతో తీవ్రవాదులకు ఉపయోగం ఏంటి..? ఒకవేళ ఇక్కడ మరో పాకిస్తాన్‌ని సృష్టించాలని వాళ్లనుకుంటే మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అది జరగనివ్వం. పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యలను ఆపకుంటే చాలా కఠిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. 75 ఏళ్లలో ఇక్కడ పాకిస్తాన్‌ని నిర్మించలేకపోయారు. అలాంటిది ఇప్పుడెలా సాధ్యమవుతుంది.? తీవ్రవాదుల ద్వారా మా దేశంలోని అమాయకులను చంపుతుంటే భారత్‌తో శాంతి చర్చలు ఎలా జరుపుతారు’’ అని ఫరూక్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఇద్దరు టెర్రరిస్టులు కాల్పులకు తెగబడడంతో ఇద్దరు కార్మికులు స్పాట్‌లో మరణించగా.. ఓ డాక్టర్‌తో పాటు మరో నలుగురు కార్మికులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు.

Advertisement

Next Story