- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తమిళంలోకి పాఠాలను అనువదించే ధైర్యం ఉందా?

- హిందీ వివాదం వెనుక ఎందుకు దాక్కుంటారు?
- తమిళ విద్యలో డీఎంకే బలహీనంగా ఉంది
- అవినీతీ ఆరోపణలను కప్పిపుచ్చడానికే ఈ అంశం ఎన్నుకుంది
- డీఎంకేపై విరుచుకపడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి వైద్య, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలోకి తర్జుమా చేసే ధైర్యం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఇలాంటి అవసరమైన విషయాల్లో చర్యలు తీసుకునే ధైర్యం లేదని ఆయన స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. నూతన విద్యా విధానం 2020ను అమలు చేయడంపై కొన్నాళ్లుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం నెలకొంది. ఎన్ఈపీ పేరుతో హిందీ భాషను కేంద్రం బలవంతంగా రుద్దుతోందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో భాష చుట్టూ నెలకొన్న వివాదంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడారు. వైద్య, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలోకి అనువదించే ధైర్యం డీఎంకే పార్టీకి లేదని అన్నారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాగానే ఈ కోర్సులను తమిళంలోకి అనువదించేలా చూస్తామని అన్నారు.
డీఎంకే ప్రజల దృష్టిని మళ్లించడానికే భాషా వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అమిత్ షా ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను దాచాలనే ఉద్దేశంతోనే భాషా వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అమిత్ షా అన్నారు. హిందీ ఏ జాతీయ భాషతోనూ పోటీ పడదని.. ఈ భాష కేవలం సామరస్యాన్ని పెంపొందిస్తుందని అమిత్ షా పునరుద్ఘటించారు. అన్ని భారతీయ భాషలకు తోడుగా హిందీ ఉంటుందని ఆయన చెప్పారు. దేశంలో హిందీ ఆధిపత్య పాత్రకంటే సహాయక పాత్ర పోషించనున్నదని పేర్కొన్నారు. దేశంలోని భాషా వైవిధ్యాన్ని బలోపేతం చేయడంలో, ప్రాంతీయ భాషల మధ్య పరస్పర సంబంధాన్ని పెంపొందించడంలో హిందీ సహాయపడుతుందని అమిత్ షా అన్నారు.
భాష పేరుతో దేశాన్ని విభజించే వారి అజెండా నెరవేరకుండా ఉండాలనే విషయాన్ని తాను దేశ ప్రజలందరికీ చెప్పాలని అనుకుంటున్నానని అన్నారు. అధికార భాషా శాఖ కింద ఎన్డీయే ప్రభుత్వం భారతీయ భాషల విభాగాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, బెంగాళీ వంటి భాషల వినియోగాన్ని పెంపొందించడానికి ఈ శాఖ పని చేస్తుందని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రాంతీయ భాషల్లో అధికారికి ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రారంభిస్తామని అమిత్ షా వెల్లడించారు. డిసెంబర్ తర్వాత పౌరులతో పాటు ముఖ్యమంత్రులు, మంత్రలు, పార్లమెంట్ సభ్యులు తమ సొంత భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించవచ్చని ఆయన తెలిపారు. అవినీతిని దాచడానికి భాష పేరుతో తమ సొంత అజెండాను నడిపేవారికి ఇది తమ నుంచి వస్తున్న బలమైన సమాధానమని అమిత్ షా పేర్కొన్నారు. దక్షిణ భారత భాషలను బీజేపీ వ్యతిరేకిస్తోందని వచ్చిన ఆరోపణలను అమిత్ షా ఖండించారు.