Delhi : ఢిల్లీలో మళ్లీ మెరుగైన గాలి నాణ్యత.. సుప్రీంకోర్టు కీలక అనుమతి

by Hajipasha |   ( Updated:2024-12-05 12:23:39.0  )
Delhi : ఢిల్లీలో మళ్లీ మెరుగైన గాలి నాణ్యత.. సుప్రీంకోర్టు కీలక అనుమతి
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో గాలి నాణ్యతా సూచీ (Air Quality Index) కొంత మెరుగైంది. గురువారం ఉదయం గాలి నాణ్యతా స్థాయి 161 పాయింట్లుగా నమోదైంది. ఏక్యూఐ స్థాయులు 101 నుంచి 200 పాయింట్ల మధ్య నమోదైతే దాన్ని ‘మోడరేట్’ (మోస్తరు) కేటగిరీగా పరిగణిస్తారు. ఈ లెక్కన ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత ‘మోస్తరు’ స్థాయిలో ఉంది. ఇంతకుముందు హస్తినలో గాలి నాణ్యత ‘తీవ్రంగా’ డౌన్ కావడంతో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ - 4’ (గ్రేప్-4) ఆంక్షలను అమలు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలిచ్చింది.

ఇప్పుడు గాలి నాణ్యత మెరుగవడంతో ఆ ఆంక్షల ఉపసంహరణకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి అనుమతులు మంజూరు చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ చర్యల అమలుపై వాదనలు వింటున్న క్రమంలో ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. గ్రేప్-4 ఆంక్షల అమలులో భాగంగా ఢిల్లీలో నిర్మాణ రంగ పనులను ఆపేశారు. కాలం తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా బ్యాన్ విధించారు. పలు ప్రభుత్వ విభాగాల సిబ్బందికి వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించారు. ఢిల్లీ స్కూళ్లలోని ఐదో తరగతి వరకు విద్యార్థులకు వర్చువల్ క్లాసులలో విద్యా బోధన చేశారు.

Advertisement

Next Story