WB Governor: ఆర్టికల్ 361పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
WB Governor: ఆర్టికల్ 361పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: గవర్నర్ నేర విచారణ గురించి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. నేర విచారణ నుంచి గవర్నర్ లకు మినహాయింపు కల్పించే ఆర్టికల్ 361 రాజ్యాంగ బద్ధతను పరిశీలించేందుకు అంగీకరించింది. పశ్చిమ బెంగాల్‌(West Bengal Governor) గవర్నర్‌ సీవీ ఆనంద బోస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అక్కడి రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న ఓ మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపైనే బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గవర్నర్లకు రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 361పై న్యాయ సమీక్ష చేయాలని కోరారు. నేర విచారణ నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనికి సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకారం తెలిపింది. ఈ విషయంపై బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు, యూనియన్ ఆఫ్ ఇండియాను కూడా ప్రతివాదిగా చేర్చేందుకు పిటిషన్ కు అనుమతిచ్చింది.

అటార్నీ జనరల్ సాయం కోరిన ధర్మాసనం

ఈ సమస్యల ముఖ్యమైందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై తీర్పు ఇచ్చేందుకు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ సహాయాన్ని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 కింద.. రాష్ట్రపతి లేదా గవర్నర్‌ తన అధికారాలు, విధులను నిర్వర్తించే విషయంలో ఏ కోర్టుకు జవాబుదారీగా ఉండరు. కాగా.. బెంగాల్ గవర్నర్ కు రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ ప్రస్తుత కేసులో దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించింది. మూడు వారాల తర్వాత తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. ఇకపోతే, ఉద్యోగం విషయంలో సాయం చేస్తానని గవర్నర్ ఆనంద బోస్ తనను వేధించారని.. ఈ ఏడాది మే నెలలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను గవర్నర్ కార్యాలయం ఖండించింది. ఎన్నికల వేళ ప్రభుత్వం తనపై ఇలాంటి కుట్రలు పన్నుతోందని గవర్నర్‌ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed