‘సీట్ల’ముడి : కేజ్రీవాల్‌ను హిట్లర్‌తో పోల్చిన కాంగ్రెస్ నేత

by Hajipasha |
‘సీట్ల’ముడి : కేజ్రీవాల్‌ను హిట్లర్‌తో పోల్చిన కాంగ్రెస్ నేత
X

దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యనున్న వైరం బుధవారం తారాస్థాయికి చేరింది. ‘‘పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ల తీరు హిట్లర్‌ను తలపిస్తోంది’’ అని రాష్ట్ర కాంగ్రెస్‌ నేత ప్రతాప్ సింగ్ బజ్వా వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. పంజాబ్‌లో ఆప్ నియంతృత్వ పాలన అడాల్ఫ్ హిట్లర్‌‌ను గుర్తు చేస్తోందని ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ‘‘ఆప్ నేతలు మాన్, కేజ్రీవాల్‌లకు నేను ఇస్తున్న సలహా ఒక్కటే. వాళ్లిద్దరూ అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలను వాళ్ల ఆఫీసుల నుంచి తీసేసి హిట్లర్‌ ఫొటోను పెట్టుకోవాలి. మీరు హిట్లర్ ఫొటోను జాగ్రత్తగా గమనించినట్లయితే.. అది అచ్చం మాన్, కేజ్రీవాల్‌లకు సరిపోలుతుంది’’ అని ఆయన కామెంట్ చేయడం రాజకీయ దుమారం రేపింది. ఓ వైపు సీట్ల పంపకాలపై ఆప్, కాంగ్రెస్‌ దిగ్గజ నేతలు సీరియస్‌గా చర్చలు జరుపుతున్న తరుణంలో ప్రతాప్ కామెంట్స్ గ్యాప్‌ను పెంచాయి. ఆప్ నేత రాఘవ్ చద్దా, కాంగ్రెస్ నేత పవన్ బన్సల్‌లు చండీగఢ్‌లో భేటీ అయిన ఫొటోను ఇండియా కూటమి ఐక్యతా సందేశంగా ఇరుపార్టీలు ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే.. కాంగ్రెస్‌ నేత ప్రతాప్ సింగ్ బజ్వా తనదైన శైలిలో ఆప్‌పై విరుచుకుపడ్డారు. దీంతో వాస్తవం ఏమిటి ? రాజకీయం ఏమిటి ? అనేది అర్థం చేసుకోలేని పరిస్థితి తలెత్తింది.

Advertisement

Next Story

Most Viewed