నెలరోజుల్లో వలస కూలీల రేషన్ కార్డుల వెరిఫికేషన్ పూర్తిచేయాలి: రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

by S Gopi |
నెలరోజుల్లో వలస కూలీల రేషన్ కార్డుల వెరిఫికేషన్ పూర్తిచేయాలి: రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రేషన్ కార్డుల జారీ కోసం ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్‌లో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలపై అసంతృప్తిని వ్యక్తం చేసిన భారత అత్యున్నత న్యాయస్థానం ఇది దురదృష్టకరమని పేర్కొంది. నాలుగు వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిర్ణీత గడువులోగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే సంబంధిత కార్యదర్శులకు సమన్లు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదే సమయంలో వలస కార్మికుల వెరిఫికేషన్‌ను పూర్తి చేసిన రాష్ట్రాలకు ఆహార ధాన్యాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 'నాలుగు నెలల్లో వెరిఫికేషన్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు. ఈ సమయం చాలా ఎక్కువ. మళ్లీ ఇప్పుడు ఇంకో రెండు నెలలు అడుగుతున్నారు. అందుకు ఆమోదం ఇవ్వలేం. మొత్తం వెరిఫికేషన్ నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని, తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వలస కార్మికులకు సంబంధించి 100 శాతం వెరిఫికేషన్ పూర్తి చేసిన రాష్ట్రాలు బీహార్, తెలంగాణ మాత్రమేనని విచారణ సమయంలో సీనియర్‌ అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టుకు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed