లండన్ నుంచి భారత్ చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం..ప్రదర్శించేది అక్కడే?

by vinod kumar |
లండన్ నుంచి భారత్ చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం..ప్రదర్శించేది అక్కడే?
X

దిశ, నేషనల్ బ్యూరో: అఫ్జల్‌ఖాన్‌ను చంపేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించినట్టు భావించే ‘వాఘ్ నఖ్’ (పులి గోళ్లలా కనిపించే ఆయుధం)ని బుధవారం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుంచి ముంబైకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సాంస్కృతిక మంత్రి సుధీర్ ముంగంటివార్ వెల్లడించారు. వాఘ్ నఖ్‌ను పశ్చిమ మహారాష్ట్రలోని సతారాలో ఉన్న ఛత్రపతి శివాజీ మ్యూజియంకి తీసుకెళ్లనున్నారు. అక్కడ జూలై 19 నుంచి దీనిని ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిట్‌ను సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు ప్రారంభించనున్నారు. ఇది విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియంతో ఒప్పందం ప్రకారం మూడు సంవత్సరాల పాటు మహారాష్ట్రలో ప్రదర్శిస్తారు. సతారాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, నాగ్‌పూర్‌లోని సెంట్రల్ మ్యూజియం, కొల్హాపూర్‌లోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్, ముంబైలోని సీఎస్ఎంపీఎస్ అనే నాలుగు మ్యూజియంలలో వాఘ్ నఖ్ ప్రదర్శిస్తారు.

కాగా, 1659లో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను చంపడానికి శివాజీ వాఘ్ నఖ్‌ని ఉపయోగించాడని చరిత్ర కారులు భావిస్తారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ప్రతాప్‌ఘర్ కోట పాదాల వద్ద అఫ్జల్ ఖాన్‌ను చంపినట్టు చెబుతారు. కాలక్రమంలో ఇది బ్రిటన్‌కు చేరగా.. లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. అనేక ప్రయత్నాల అనంతరం దీనిని ఎట్టకేలకు స్వదేశానికి తీసుకువచ్చారు. అయితే లండన్ నుంచి తెప్పిస్తున్న వాఘ్ నఖ్ శివాజీకి చెందినది కాదని ఇటీవల చరిత్రకారుడు ఇంద్రజిత్ సావంత్ పేర్కొన్నాడు. శివాజీ ఉపయోగించిన అసలు వాఘ్ నఖ్ సతారాలో అతని వారసుల వద్ద ఉందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది.

Advertisement

Next Story