Bangladesh Crisis: భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి..!

by Shamantha N |
Bangladesh Crisis: భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి..!
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లా-భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్ వద్ద దేశం దాటి భారత్ లోకి చొరబడేందుకు మాజీ జడ్జి షంషుద్దీన్ చౌదురి మాణిక్‌ ప్రయత్నించినట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. సిల్హెట్‌లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన షంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. జస్టిస్ మాణిక్ ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థి నాయకులను “రజాకార్లు” అని విమర్శించిన అప్పటి ప్రధాని షేక్ హసీనా పక్షాన నిలిచారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జరిగిన భారీగా దురాగతాలకు సంబంధించిన మిలీషియా సభ్యులే రజాకార్లు. దీంతో, ఆ వ్యాఖ్యలపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

సైనిక స్థావరాల్లో మాజీ మంత్రులు

మరోవైపు, హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నాయకుడు ఫిరోజ్‌ను అతని నివాసంలో అరెస్టు చేశారు. హసీనా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారిని, ఉన్నతాధికారులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకుల ప్రాణాలకు ముప్పు ఉండటంతో సైనిక స్థావరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఆగస్టు 8న తాత్కాలిక తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ కొన్నిరోజులుగా బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (BNP) డిమాడ్ చేస్తుంది. హసీనాపై హత్య కేసు సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా హసీనాను అప్పగించాలని బీఎన్పీ వాదిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed