నీటిపై తేలియాడే రెస్టారెంట్‌.. ప్రారంభించిన అమిత్ షా

by Vinod kumar |
నీటిపై తేలియాడే రెస్టారెంట్‌.. ప్రారంభించిన అమిత్ షా
X

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌ నగరంలోని సబర్మతి నదిలో 'అక్షర్‌ రివర్‌ క్రూయిజ్‌' పేరుతో నీటిపై తేలియాడే రెస్టారెంట్ స్టార్ట్ అయింది. దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. ప్రధాని మోడీ చొరవతోనే ఈ ప్రాజెక్టు సాకారమైందని చెప్పారు. దీనివల్ల గుజరాత్ టూరిజం మరింత బలోపేతం అవుతుందన్నారు. "1978లో నేను అహ్మదాబాద్‌కు మారినప్పుడు కూడా సబర్మతీ నదిని చూడడానికి వెళ్లలేదు. నది అప్పుడు మురికి నీటి గొయ్యిలా ఉండేది. ఇప్పుడు సబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్‌లో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు నెలవుగా మారింది" అని పేర్కొన్నారు.

తేలియాడే రెస్టారెంట్‌లో ఏమున్నాయంటే..

ఇప్పటివరకు ముంబై , గోవాలలోనే అందుబాటులో ఉన్న తేలియాడే రెస్టారెంట్ ఇప్పుడు గుజరాత్ లోని సబర్మతి నదిపై కూడా ప్రారంభమైంది. దీన్ని అహ్మదాబాద్‌లోని అక్షర్ ట్రావెల్స్, అమ్దావద్ మున్సిపల్ కార్పొరేషన్, సబర్మతి రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ ను నిర్మించడానికి రూ.10 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై కప్పు ఉంటుంది. కాబట్టి పర్యాటకులు వర్షాకాలంలో కూడా ప్రశాంతంగా జర్నీ చేస్తూ ఫుడ్ తినొచ్చు.

ఈ రెస్టారెంట్‌లో 162 సీట్లు ఉన్నాయి. ఈ క్రూయిజ్ సైజు 30 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు. ఒక వ్యక్తి క్రూయిజ్ టూర్ ఖర్చు రూ. 2,000. జూలై 10 నుంచి ఈ యాత్రకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇందులో కూర్చుంటే.. భోజనం చేస్తూ గంటన్నర పాటు(90 నిమిషాలు) జల విహారం చేయొచ్చు. సిటీలోని సర్దార్ బ్రిడ్జి నుంచి గాంధీ వంతెన వరకు ఈ రెస్టారెంట్ ట్రావెల్ చేస్తుంది.

Advertisement

Next Story