దేశంలో పరిపాలన, ఆర్థిక విధానాలు, కాంగ్రెస్ పార్టీపై అమర్త్యసేన్‌ సంచలన వ్యాఖ్యలు

by Harish |   ( Updated:2024-04-14 10:18:52.0  )
దేశంలో పరిపాలన, ఆర్థిక విధానాలు, కాంగ్రెస్ పార్టీపై అమర్త్యసేన్‌ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ అవార్డ్ గ్రహీత, భారత రత్న అమర్త్యసేన్‌ దేశంలో పరిపాలన, ఆర్థిక విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో విస్తృతమైన నిరక్షరాస్యత, అసాధారణ లింగ అసమానతలు పేదల పురోగతిని కష్టతరం చేస్తున్నాయని బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. దేశంలో పాలక వర్గాలు ధనవంతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటాయి. దీంతో పేదలు అభివృద్ధి చెందడం కష్టమవుతుంది. మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం ద్వారా వెనుకబడిన వారికి మరింత సాధికారత అవసరమని అమర్త్యసేన్‌ అన్నారు.

కాంగ్రెస్‌కు అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పార్టీ గొప్ప గతం దానికి స్ఫూర్తినిస్తుందని ఆయన ప్రముఖ మీడియాతో అన్నారు. అనైక్యత కారణంగా భారత దేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని కోల్పోయాయి. జేడీ(యూ), రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ) ఇండియా కూటమి నుంచి బయటకు రావడం వలన ప్రతిపక్షాలు పట్టు సాధించడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు.

బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చవచ్చని ప్రతిపక్షాల వాదన గురించి మాట్లాడుతూ, దేశ రాజ్యాంగాన్ని మార్చడం వల్ల ప్రభుత్వం ఒక మతానికి మాత్రమే లాభం చేకూర్చినట్లవుతుంది. అంతే తప్ప మరే ప్రయోజనం ఉండదు, దీని ద్వారా సామాన్య ప్రజలకు ఉపయోగం ఉండదని అమర్త్యసేన్‌ అన్నారు. హిందువుల గుర్తింపుపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం వలన చాలా మంది హిందువులకు మేలు కలగవచ్చు కానీ, భారతదేశం లౌకిక రాజ్యాంగంతో కూడిన లౌకిక దేశం. రాజ్యాంగాన్ని మార్చడం వలన భారతదేశ లౌకిక మూలాలకు, బహుళ సాంస్కృతిక స్వభావానికి ద్రోహం చేసినట్లవుతుందని ఆయన అన్నారు.

Advertisement

Next Story