Afspa: అసోంలోని 4 జిల్లాల్లో అఫ్సా పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

by vinod kumar |
Afspa: అసోంలోని 4 జిల్లాల్లో అఫ్సా పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలోని నాలుగు జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్సా) మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టిన్సుకియా, దిబ్రూగర్, చరైడియో, శివసాగర్ జిల్లాల్లో అఫ్సాను పొడిగించారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో ఇటీవలి ఆందోళనలు, అశాంతి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. శాంతి భద్రతల దృష్యా అఫ్సా గడువు పెంచాలని అసోం ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. దీనిని పరిశీలించిన కేంద్రం అక్టోబర్ 1 నుంచి మరో ఆరు నెలల పాటు రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్న జిల్లాల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని తెలిపింది.

కాగా, శాంతి భద్రతలు క్షీణించిన ప్రాంతాల్లో మాత్రమే అమలు అఫ్సాను అమలు చేస్తారు. ఈ ప్రదేశాలలో భద్రతా దళాలు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. పరిస్థితులను నియంత్రించేందుకు కాల్పులు సైతం జరపొచ్చు. ఈశాన్య ప్రాంతంలోని భద్రతా బలగాల సౌలభ్యం కోసం ఈ చట్టాన్ని 1958 సెప్టెంబర్ 11న ఆమోదించారు. అసోంలో మొదటిసారిగా 1990 నవంబర్‌ లో అఫ్సా విధించారు. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు దానిని పొడిగించారు. పలు ప్రాంతాల నుంచి క్రమంగా ఉపసంహరించారు. గతేడాది అక్టోబర్ నుంచి నాలుగు జిల్లాల్లో మాత్రమే అఫ్సా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి అఫ్సా విధించారు.

Advertisement

Next Story