Assam: వెలుగులోకి వచ్చిన రూ.22 వేల కోట్ల భారీ కుంభకోణం

by Shamantha N |
Assam: వెలుగులోకి వచ్చిన రూ.22 వేల కోట్ల భారీ కుంభకోణం
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో రూ. 22 వేల కోట్ల భారీ కుంభకోణం జరిగింది. అసోం రాష్ట్ర పోలీసులు ఈ కుంభకోణం గుట్టు రట్టు చేశారు. పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల (stock market investments) పేరిట ప్రజల నుంచి మోసగాళ్లు సొమ్మును సమీకరించారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో దిబ్రూగఢ్ కు చెందిన 22 ఏళ్ల వ్యాపారి విశాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అసోం వ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. తన సంపన్న జీవనశైలిని ఉపయోగించి ఫుకాన్ ప్రజలను ఆకర్షించాడని పోలీసులు తెలిపారు. పెట్టుబడులు పెడితే 60 రోజుల్లో 30 శాతం రాబడి వస్తుందని ప్రజలను మభ్యపెట్టాడని అన్నారు. నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించి అస్సామీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి పలు ఆస్తులు సంపాదించినట్లు గుర్తించామన్నారు. ఇకపోతే, దిబ్రూగఢ్ లోని ఫుకాన్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. స్కాంకి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన అస్సామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం పోలీసులు వెతుకుతున్నారు.

అసోం సీఎం హెచ్చరికలు

మోసపూరిత ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రజలను కోరారు. తక్కువ ప్రయత్నంతో డబ్బును రెట్టింపు చేస్తామంటే.. అవన్నీ మోసపూరితమైనవే అని గుర్తిచేశారు. “ఈ ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థల ద్వారా స్టాక్ మార్కెట్‌లో డబ్బును పెట్టుబడి పెట్టే అటువంటి వ్యవస్థ లేదని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. మోసగాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మోసగాళ్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను. అక్రమంగా పెట్టుబడులు పెట్టే వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని మొత్తం రాకెట్‌ను ఛేదించేందుకు ప్రయత్నిస్తాం' అని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు.

Advertisement

Next Story