వారిపై చర్యలు తీసుకుంటాం: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

by srinivas |
MP Raghurama krishnamraju
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల పట్టాల మంజూరులో కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని, దానికి సంబంధించి ఫిర్యాదులు అందినట్టు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సెల్ఫీ వీడియో విడుదల చేశారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రాష్ట్రంలో అందరికీ ఇళ్లు ఉండాలనే దీన్ని మొదలుపెట్టారని చెప్పారు. ఈ పథకం కోసం అనేక చోట్ల స్థల సేకరణ పూర్తయిందని, అయితే, లబ్దిదారులకు స్థలాలు మంజూరు చేసేందుకు డబ్బు అడుగుతున్నారని ప్రస్తావించారు. ఒక్కో ప్లాట్‌కు రూ. 20 వేల నుంచి రూ. 60 వేల వరకు లబ్దిదారుల నుంచి డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై తనకు ఫిర్యాదులొచ్చాయని, ఈ విషయాన్ని కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి తీసుకెళ్లానని ఎంపీ తెలిపారు. ఈ ఫిర్యాదులు.. కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందాయని ఆయన చెప్పారు. లబ్దిదారుల నుంచి డబ్బు తీసుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని, లబ్దిదారులకి సొమ్ము తిరిగి ఇప్పిస్తామని, ఇళ్ల స్థలాలు అందరికీ అందేలా చూస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story