33 ఏళ్లుగా టెన్త్ క్లాస్.. కరోనా బ్యాచ్‌లో పాస్

by Shyam |
33 ఏళ్లుగా టెన్త్ క్లాస్.. కరోనా బ్యాచ్‌లో పాస్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కొత్త కష్టాలను తీసుకొస్తే ఓ హైద‌రాబాదీని మాత్రం ఆశీర్వ‌దించింది. మ‌హ్మ‌ద్ నూరుద్దీన్‌ అనే వ్య‌క్తి గత 33 ఏండ్లుగా ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ప‌రీక్ష రాసిన‌ ప్ర‌తీసారి ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. కాగా, ఈసారి క‌రోనా ఆశీర్వాదంతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అదీ కూడా ప‌రీక్ష రాయ‌కుండానే.

ముషీరాబాద్ ప్రాంతంలోని అంజుమాన్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థి నూరుద్దీన్. 1987లో మొద‌టిసారిగా ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యాడు. అన్ని పేపర్లను క్లియర్ చేసిన‌ప్ప‌టికీ ఇంగ్లీష్ మాత్రం మిగిలిపోయింది. ఇదే అత‌నికి పెద్ద అడ్డంకిగా మారింది. ప్రతి ఏడాదీ పరీక్ష రాయ‌డం పాస్ మార్కుల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి ఆగిపోవ‌డం జ‌రుగుతూ ఉంది. 32 లేదా 33 మార్కులు వ‌చ్చి ఫెయిల్ అవుతుండేవాడు. అయినా వద‌ల‌కుండా ప్ర‌య‌త్నించి పాస్ కావ‌డానికే నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పాడు.

ఈ ఏడాది సైతం ప‌రీక్ష రాసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే ఫీజు చెల్లించే చివ‌రితేదీని మిస్ అయ్యాడు. దీంతో ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది. దీనివ‌ల్ల అతను మొత్తం ఆరు పేపర్లను మళ్ళీ రాయవలసి వచ్చింది. ప‌రీక్షలు పాస్ అయ్యేందుకు తాను చాలా క‌ష్ట‌ప‌డ్డ‌ట్లు వివరించాడు. పరీక్ష సమయంలో త‌న‌కు బీకామ్ చ‌దివే కూతురు స‌హాయం చేసిన‌ట్లు చెప్పుకొచ్చాడు.

కొవిడ్ -19 కారణంగా విద్యాశాఖ ఈసారి పరీక్షలు నిర్వహించలేదు. అభ్యర్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో నూరుద్దీన్ సైతం ప‌దో తరగతి గ‌ట్టెక్కాడు. మొత్తంమీద ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత సాధించినందుకు త‌న‌కెంతో సంతోషంగా ఉంద‌న్నాడు. కానీ, ఇది చాలా కాలం కిందటే జరిగి ఉండాల్సిందని అభిప్రాయ‌ప‌డ్డాడు.

అప్ప‌టి రోజుల‌ను ఆయ‌న గుర్తుచేసుకుంటూ రైల్వే, పోలీసు లేదా ఇతర విభాగాలలో ఏదైనా ఉద్యోగం సంపాదించాలంటే ఆ రోజుల్లో ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త త‌ప్ప‌నిస‌రి అని అన్నారు. ప‌ది ఫెయిల్ కావ‌డంతో 1990 నుంచి తాను చ‌దివిన అదే పాఠ‌శాల‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న‌ట్లు తెలిపాడు. ప్రస్తుతం రూ.8,000 జీతం తీసుకుంటున్నాడు. ప్ర‌తీ ఏడాది ప‌రీక్ష‌లు రాసేందుకు వెళ్లగా కొంద‌మంది కామెంట్లు చేసేవార‌ని కానీ, తానెప్పుడు వాటిని ప‌ట్టించుకోలేద‌న్నాడు. ప‌రీక్ష పాస్ అయేందుకే ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed