దేశానికే తెలంగాణ దిక్చూచి.. మంత్రి మల్లారెడ్డి

by Shyam |
Malla Reddy
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: అనేక ప్రతికూలతలను అధిగమించి, సామాజిక, ఆర్థిక పునాదిని పటిష్టం చేసుకుంటూ దేశానికే తెలంగాణ దిక్చూచి లా తయారైంది..ఆర్థిక పరమైన చిక్కులు, అవంతరాలు వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజా సంక్షేమ పథకాలను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొంది శనివారం నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి మల్లారెడ్డి రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ’దిశ‘ ప్రతినిధి తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

దేశానికే ఆదర్శం..

ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు.పేదింట్లో ఆడపిల్లల పెండ్లిలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మన సీఎం 2016లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టారని చెప్పారు. రూ.51 వేల తో ప్రారంభమైన పథకం ప్రస్తుతం ఒక లక్ష పదహారు వేలకు పెంచి ఇస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

రైతును రాజు చేయాలన్నదే..

రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం. తెలంగాణను సశ్యశామలం చేసేందుకు చారిత్రాత్మకమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించారు. తద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. అదే విధంగా రైతులు నష్టపోకుండా పంటలకు పెట్టుబడి సాయం అందించడమే కాకుండా పండించిన పంటలకు, రైతులకు వ్యక్తిగత భీమాను ఏకకాలంలో అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణనేనన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఎఫ్ఎస్ సీఎస్, పీఏసీఎస్ ల ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతు వేదికల ద్వారా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి వాణిజ్య పంటల పై అవగాహన కల్పించాం. మత్స్య సంపదను పెంపొందించే విషయంలో చేప పిల్లల పెంపకం వంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి.అర్హులైన పశువుల కాపరులకు ఒక యూనిట్ కు 21 గొర్రెల చొప్పున అందజేసినట్లు తెలిపారు.

24 గంటల కరెంట్..

నాణ్యమైన విద్యుత్ ను 24 గంటల పాటు సరఫరా చేస్తున్నాం. దీంతో రైతులకు కుటీర పరిశ్రమలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. టీఎస్ ఐపాస్ ద్వారా నూతన పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నాం. దీంతో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు మన రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. మన యంగ్ డైనమిక్ పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నూతన పరిశ్రమల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.

ఆకు పచ్చ తెలంగాణగా..

హరిత హారం లాంటి బృహత్తర కార్యక్రమం ద్వారా ఆకు పచ్చని తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు సర్పంచ్ లు, అధికార యంత్రాంగాన్ని భాగస్వాములను చేసింది. తద్వారా వాతావరణ సమతుల్యతను సాధించి సమృద్ధిగా వర్షాలు కురిసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

మేడ్చల్ లో 3 వేల మందికి..

మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపు 3 వేల మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య పరీక్షలు చేయించాం. నిమ్స్ లో వైద్యానికి అయ్యే ఖర్చును ఎల్వోసీ పత్రాలను అందించాం. బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉంటే వారికి వైద్యం కోసం అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని తిరిగి ఇప్పించాను. అదేవిధంగా ఆలయ భూములలో కళ్యాణ మండపాలను నిర్మించి, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలోనే శుభకార్యాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాను. ఎస్సీ సామాజిక వర్గాలకు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లను నిర్మించి ఇస్తున్నాం. జిల్లాలోని పురపాలికల్లో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపనలు చేయబోతున్నాం.

విద్యా, వైద్యంపై..

సీడీపీ కింద 40 శాతం నిధులను ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం ఇస్తున్నాం.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతాం. శామీర్ పేట, మేడ్చల్ మండలాలో 6 ప్రభుత్వ పాఠశాలను దాతల సహకారంతో అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ.. కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా తయారు చేశాం. మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయలన్నా చిరకాల వాంచను సీఎం కేసీఆర్ ద్వారా అతి త్వరలోనే సాకారం చేయబోతున్నాం.

సమస్యలపై పోకస్..

ముఖ్యంగా ఇటీవల భారీ వర్షాలకు వరద నీటి ముంపుకు గురైన పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్ లో రూ.110 కోట్లతో స్టామ్ వాటర్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. పల్లె, పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులను 100 శాతం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసి, ఆ దిశగా ముందుకు వెళ్లుతున్నాం. మున్సిపాలిటీలలో సమస్యల పరిష్కారానికి ఇటీవలే కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించాం. అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వ సహకారంతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.

జవహర్ నగర్ పై ప్రత్యేక నజర్..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికి వాడ జవహర్ నగర్.. గ్రామ పంచాయితీగా ఉన్న జవహర్ నగర్ ను కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశాం. కానీ ఇక్కడ సుదీర్ఘకాలంగా ఇళ్ల క్రమబద్దీకరణ సమస్య ఉంది. దాదాపు 40 వేల ఇళ్లను క్రమబద్దీకరించాల్సి ఉంది. ఇళ్లను క్రమబద్దీకరిస్తే జవహర్ నగర్ కార్పొరేషన్ కు రూ.వేల కోట్ల ఆదాయం వస్తుంది. సీఎం కేసీఆర్ సహకారంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నా.. ప్రజల బాగోగులు, నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు పరితపించే తనపై ప్రతిపక్షాలు, గిట్టని వారు తనపై లేనిపోని అరోపణలు చేస్తున్నారు.. తాను లక్ష్మి పుత్రుడిని ఆక్రమణలకు పాల్పడే అవసరం తనకు లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. రానున్న రెండేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed