జోకా..మజాకా.. మరో వివాదంలో మంత్రి మల్లారెడ్డి

by Anukaran |   ( Updated:2021-08-31 00:11:19.0  )
mallareddy-minister 1
X

దిశ, జవహర్ నగర్: మంత్రి మల్లారెడ్డి జోకులపై డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి మండిపడుతోంది. కార్పొరేషన్ పరిధిలో ఆదివారం జరిగిన పాపన్న విగ్రహావిష్కరణ అనంతరం మంత్రి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నంలో డంపింగ్ యార్డ్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘మీకు అన్నీ సౌలతులు కల్పిస్తా.. ఇంకోటి అదృష్టం చూసినవా.. మనకే వాసన జవహర్ నగర్‌కు దిక్కులేదు ఇప్పుడూ.. నవ్వుతూ.. అక్కడ దమ్మాయి గూడ దిక్కు పోయింది. అంటూ జోకులు చెప్పడంతో కొందరు నవ్వుకుంటున్న క్రమంలో అంతలోనే అక్కడున్న మహిళలు వాసన మాకు కూడా వస్తుంది. మాకేమీ మేలు జరగలే సార్.. అనగానే వస్తుంది అక్కా, అంటూ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.’ ఇదే విషయంపై ఆదివారం రాత్రి నుంచి పలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోన్న వీడియోలో మల్లారెడ్డి మాటలు, దమ్మాయి గూడ ప్రజలను అవమానించారని, డంపింగ్ యార్డ్ జాక్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. అయ్యా మంత్రి గారూ.. దమ్మాయి గూడ‌కు వాసన వస్తే మీకు అదృష్టమా.. ? వాసన జవహర్ నగర్ నుంచి దమ్మాయి గూడ‌కు రాదు, దమ్మాయి గూడ నుంచి జవహర్ నగర్‌కు పోదు.. అది గాలి ఎటువుంటే అటే పోతుంది. మీ లాంటి రాజకీయ నాయకులలాగా, ఎక్కడి ప్రజలను అక్కడ ప్రలోభాలకు గురి చేస్తూ, ఒకరిని మెచ్చుకుంటూ, ఇంకొకరిని కించపరచడం మీకు తగునా, అంటూ జాక్ కమిటీ కో కన్వీనర్ కేతేపల్లి పద్మాచారి మండిపడ్డారు. తక్షణం దమ్మాయి గూడ ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ డంపింగ్ యార్డ్ మూసివేత‌కు కృషి చేయ్యాలని డిమాండ్ చేశారు. మంత్రిగా బాధ్యతతో ప్రభుత్వాన్ని ఒప్పించి డంపింగ్ యార్డ్ ఎత్తివేసేలా కృషి చెయ్యండి. లేదంటే డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేక పోరాట సమితిలో చేరి సారథ్యం వహించి ఉద్యమం చేయండని మంత్రికి వారు హితవు పలికారు.

Advertisement

Next Story