ఏడేండ్లలో రూ.2.20 ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు : మంత్రి కేటీఆర్

by Sridhar Babu |
ఏడేండ్లలో రూ.2.20 ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు : మంత్రి కేటీఆర్
X

దిశ ప్రతినిధి,రంగారెడ్డి: పారిశ్రామిక రంగంలో తెలంగాణ భార‌త‌దేశంలోనే ముందు వ‌రుస‌లో దూసుకెళ్తోంద‌ని ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 2015 నుంచి ఇప్పటి వ‌ర‌కు టీఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ‌కు రూ.2.20 ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌న్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు స‌మీపంలోని మేక‌గూడ‌లో పోక‌ర్ణ ఇంజ‌నీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీని మంత్రి కేటీఆర్ మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, ఎంపీ మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో స‌మ‌ర్ధవంత‌మైన నాయ‌క‌త్వం, సుస్థిర‌త‌తో కూడిన ప్రభుత్వం ఉన్నందునే పెట్టుబ‌డులు త‌ర‌లివ‌స్తున్నాయి. ఈ రెండు స‌మ‌తుల్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో స‌మ‌తుల్య‌మైన అభివృద్ధి జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాల‌కు ప్రాధాన్యం ఇస్తూనే, ఉపాధి క‌ల్ప‌న‌ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. టీఎస్ ఐపాస్ లాంటి విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు ఎన్నో చేప‌ట్టామ‌ని తెలిపారు. టీఎస్ ఐపాస్ లాంటి పాల‌సీ ఏ రాష్ట్రంలో లేదు. 15 రోజుల్లోనే ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇస్తున్నాం. 15 రోజుల్లో అనుమ‌తి రాక‌పోతే డీమ్డ్ అప్రూవ్డ్‌గా భావించ‌వ‌చ్చు అని పేర్కొన్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు నిరాంత‌రాయంగా నాణ్య‌మైన క‌రెంటు, నీళ్లు అందిస్తున్నామ‌ని తెలిపారు. పోక‌ర్ణ కంపెనీలో స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల‌ని కోరారు. ఈ ప్లాంటు ద్వారా ప్ర‌త్య‌క్షంగా 500 మందికి, ప‌రోక్షంగా 3 వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు. ఈ కంపెనీకి అన్ని విధాలా తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు. క‌లిసిక‌ట్టుగా ముందుకు న‌డిస్తేనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని కేటీఆర్ తెలిపారు.

స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే అంజన్న వినతి…

కొత్తగా ప్రారంభించిన కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు తప్పకుండా కల్పించాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం పాటుపడుతుండటం విశేషం అని కొనియాడారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ హయాంలో పారిశ్రామిక ప్రగతి పెద్ద ఎత్తున జరుగుతుందని ఆయన చెప్పారు. ఎలాంటి భూగర్భ కాలుష్యం రాకుండా 20 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నాన్ పొల్యూషన్ కంపెనీగా తీర్చిదిద్దడం పట్ల యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభినందించారు.

టీఎస్ ఐపాస్ అద్భుతం : గౌత‌మ్ చంద్

తెలంగాణ ప్ర‌భుత్వం తెచ్చిన పారిశ్రామిక పాల‌సీ టీఎస్ ఐపాస్ అద్భుతంగా ఉంద‌ని పోక‌ర్ణ లిమిటెడ్ చైర్మ‌న్ గౌత‌మ్ చంద్ పేర్కొన్నారు. త‌క్కువ స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా అనుమ‌తులు ఇవ్వ‌డం గొప్ప విష‌యమ‌న్నారు. మంత్రి కేటీఆర్ చొర‌వ‌తో దేశంలోనే అతి పెద్ద మార్బుల్ ప‌రిశ్ర‌మ‌ను మేక‌గూడ‌లో ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ప్లాంట్‌లో సూప‌ర్ జంబో, జంబో స్లాబుల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నామ‌ని గౌత‌మ్ చంద్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed