బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు..!

by Anukaran |
బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఆకర్ష్​కు మరో నేత చిక్కారు. ఈసారి అధికార పార్టీ నేతలపై గురి పెట్టారు. రాబోయే గ్రేటర్​ వరంగల్​, ఖమ్మం ఎన్నికల దృష్టా ఆ ప్రాంతాలపై బీజేపీ నేతలు ప్రత్యేక ఫోకస్​ పెట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రెబెల్లి దయాకర్​రావు సోదరుడు, టీఆర్​ఎస్​ నేత ఎర్రబెల్లి ప్రదీప్​రావు త్వరలోనే కాషాయం కండువా కప్పుకోనున్నారు. అధికార పార్టీ నేతలతో వైరం ఎక్కువవుతున్న నేపథ్యంలో కమలం గూటికి చేరుతున్నారు. మంత్రి సోదరుడైనప్పటికీ… వరంగల్​ అర్బన్​, రూరల్​ ఎమ్మెల్యేలతో ప్రదీప్​రావుకు యుద్ధమే నడుస్తోంది. ప్రదీప్​రావు ప్రస్తుతం రాష్ట్ర నెక్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​వుకు స్వయానా సోదరుడైన ప్రదీప్​రావు గతంలోనే వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే స్థానం టికెట్​ కోసం ప్రయత్నాలు చేశారు. టీడీపీ నుంచి దయాకర్​రావు వెంటే ఉంటున్నారు. దయాకర్​రావు టీఆర్​ఎస్​లో చేరడంతో అన్నతో పాటు ఆయన కూడా చేరారు. ప్రస్తుతం అన్నను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ నేతలతో చర్చలు సాగించారు. అయితే వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే టికెట్​పైనే ప్రదీప్​రావు పట్టుబట్టినట్లు సమాచారం. దీనిపై బీజేపీ నుంచి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ… స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు. మంత్రి దయాకర్​రావు తమ్ముడు కావడంతో బీజేపీ కూడా కొంత పునరాలోచనలో పడింది. తీరాసమయంలో అన్నకు మద్దతుగా పార్టీకి ఏదైనా వెన్నుపోటు వంటి ప్రయత్నాలు చేస్తాడా… అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతోనే స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

అంతేకాకుండా పలు వ్యాపారాలతో పాటు నెక్​ చైర్మన్​గా వ్యవహరిస్తున్న ప్రదీప్​రావుకు వరంగల్​ పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలతో పొసగడం లేదు. అంగన్​వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా అంశంలో ఎమ్మెల్యేలు కూడా ప్రదీప్​రావును ప్రశ్నించారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో సమోద్య లేకపోయినా… మంత్రి తమ్ముడు కావడంతో లోలోన ప్రదీప్​రావును టార్గెట్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రదీప్​రావుకు సంబంధించిన అనుచరుల మీద కేసులు కూడా నమోదు చేయించినట్లు ఆరోపణలున్నాయి. అయితే ప్రదీప్​రావుకు ముందు నుంచీ వరంగల్​ తూర్పు సెగ్మెంట్​పై గురి ఉండటంతో అక్కడ ప్రత్యేక అనుచరులను పెంచి పోషిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. దీంతో వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే కూడా ప్రదీప్​రావుపై పగబట్టినట్లు సమాచారం. మరోవైపు ఈ స్థానం నుంచి టికెట్​ వచ్చే అవకాశాలు లేకపోవడంతో ప్రదీప్​రావు బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు చెప్పుతున్నారు. శుక్రవారం కూడా ప్రదీప్​రావుతో చర్చలు సాగించిన బీజేపీ ఆయన్ను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఆహ్వానించింది. అయితే తూర్పు స్థానంపై మాత్రం కచ్చితమైన హామీ ఇవ్వడం లేదు. పరిశీలిస్తామని చెప్పడంతో ప్రదీప్​రావు బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు చెప్పుతున్నారు. త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed