నాకైతే సిగ్గ‌నిపిస్తోన్నది : ఎర్రబెల్లి

by Shyam |
నాకైతే సిగ్గ‌నిపిస్తోన్నది : ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్: ‘జ‌ల‌దీక్ష‌ల పేరుతో కాంగ్రెస్, బీజేపీలు దొంగ‌నాట‌కాలు ఆడుతున్నాయి. వాళ్లు పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్క‌టి లేదు. వాళ్లు ధ‌ర్నాలు చేస్తుంటే నాకైతే సిగ్గ‌నిపిస్తున్న‌ది.. వాళ్లకు అనిపించ‌డం లేదా? ఇలాగే చేస్తే వాళ్లని ప్ర‌జ‌లు ఉరికిచ్చికొట్టే రోజులు వ‌స్తాయి’ అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. శనివారం వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరిలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి కాంగ్రెస్, బీజేపీల‌పై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మించింది.. దేవాదుల‌ను పూర్తి చేసింది కూడా కేసీఆరేనని, ఇప్పుడేమో ఆయా ప్రాజెక్టుల ద‌గ్గ‌ర వాళ్లు ఆందోళ‌న‌లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి చేయ‌రు.. చేయ‌నివ్వ‌రు, పైగా మూర్ఖంగా మాట్లాడుతున్నాయని, ఇవేం ప్ర‌తిప‌క్ష పార్టీలంటూ మంత్రి విమ‌ర్శ‌లు చేశారు. అస‌లు వీళ్ళేం చేశార‌ని ఆందోళ‌న‌లు చేస్తున్నారు? అంటూ ప్ర‌శ్నించారు. పెన్ష‌న్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 12 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌దని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోద‌కాలు బాధితులు, ఒంట‌రి మ‌హిళ‌లు ఆత్మ‌గౌర‌వంతో బతికే విధంగా పెన్ష‌న్లు ఇస్తున్నమన్నారు. కేవ‌లం రూ. 200 కోట్లు ఇచ్చి మొత్తం ఆ ప‌థ‌క‌మే మాదంటున్న బీజేపీని ఏమ‌నాలని ఎద్దేవా చేశారు. ఇత్తేసి, పొత్తు కూడిన‌ట్లు అంటే ఇదేనేమోనని చలోక్తి విసిరారు. ఆ రెండు పార్టీలు అభివృద్ధిని చూసి ఓర్వ‌లేక నిందారోప‌ణ‌ల‌కు దిగుతున్నాయని, మాకైతే సిగ్గ‌నిపిస్తోందని, ఆ పార్టీల‌కు అనిపించ‌డం లేదా? అని ఆయన అన్నారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తే అందుకు త‌గిన మూల్యం చెల్లించ‌క‌త‌ప్ప‌ద‌ని హెచ్చరించారు. ఇప్ప‌టికే ఆ పార్టీల‌ను ప్ర‌జ‌లు విస్మ‌రించార‌ని, ఇంకా ఇలాంటి చ‌ర్య‌ల‌కు దిగితే ఉరికిచ్చి కొట్టే రోజులు వ‌స్తాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి హిత‌వు ప‌లికారు.

Advertisement

Next Story