సోషల్ మీడియా కథనానికి కేటీఆర్ కార్యాలయం వివరణ

by Sridhar Babu |   ( Updated:2021-07-08 12:09:00.0  )
KTR twitter
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజన్న సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేట్‌కు చెందిన శిలువేరు గౌతమ్ తండ్రి గంగా ప్రసాద్ రెండు పడక గదుల ఇల్లు మంజూరు కాలేదని ఆత్మహత్య చేసుకున్నారని వచ్చిన కథనానికి మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచి వివరణ ఇచ్చారు. పద్మశాలి కులానికి చెందిన గంగాప్రసాద్ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరీ కాకపోవడంతో మృతి చెందాడని గురువారం సోషల్ మీడియాలో ప్రచారం అయిందన్నారు.

ప్రాథమిక విచారణ చేయగా మృతుడు రెండు పడకల గదుల ఇల్లు మంజురీకి దరఖాస్తు చేసుకున్నారని, అయితే విచారణలో సొంత ఇల్లు, ఇంటి పక్కన 2 గుంటల ఖాళీ స్థలం ఉన్నందున అర్జీని అధికారులు తిరస్కరించారు. అయినా అర్జీని నాలుగు సార్లు విచారణ చేయగా నాలుగు సార్లు తిరస్కరించనైనది. మృతుడు ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. ఆర్థిక పరిస్థితి బాగుందని విచారణలో తెలిసిందని, ప్రాథమిక విచారణలో ఇది కేవలం మృతుడి సన్నిహితులు ఎల్లారెడ్డిపేట గ్రామంలో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లలో ఖాళీ ఉన్నందున వాటిలో ఒకటి మంజూరి చేసేందుకు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారని తెలిసిందన్నారు.

ఈ విషయంలో 2020 నవంబర్ 1న గ్రామా పంచాయతీ కార్యాలయం, ఎల్లారెడ్డిపేట్ లో నోటీస్ బోర్డు పై అభ్యంతరాలకై అతికించిన అర్హులు, అనర్హుల జాబితాపై కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. అదే సంవత్సరం డిసెంబర్ 29న జరిగిన గ్రామ సభలో, ఇళ్ల కేటాయింపు డ్రా లో కూడా మృతుడి అర్జీ తిరస్కరణపై కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed