సమస్యను గుర్తించకపోవడం అత్యంత ప్రమాదకరం : మన్మోహన్ సింగ్!

by Harish |
సమస్యను గుర్తించకపోవడం అత్యంత ప్రమాదకరం : మన్మోహన్ సింగ్!
X

మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ప్రధాని మోదీ పాలనను విమర్శించారు. ‘మందగమనం’ అనే పదాన్ని మోదీ ప్రభుత్వం అంగీకరించడం లేదని, సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థ ప్రమాదం బారిన పడే అవకాశముందని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు.

‘మందగమనం’ అనే పదాన్నే అంగీకరించలేని ప్రభుత్వాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఇది దేశానికి అంత మంచిది కాదని నేను భావిస్తున్నానని మన్మోహన్ సింగ్ అన్నారు. మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ‘బ్యాక్‌స్టేజ్’ అనే పుస్తక ఆవిష్కరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా వృద్ధి సంవత్సరాల క్రితం జరిగిన కథ. 2024-25 నాటికి మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం కేవలం కోరిక లాంటిదే అని ప్రణాళిక సంఘం ఇదివరకు చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. కేంద్రం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకున్న ప్రమాదాన్ని గుర్తించట్లేదని మన్మోహన్ సింగ్ అన్నారు.

‘మీరు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించకపోతే దానిపై చర్యలు తీసుకోవడానికి తగిన పరిష్కారాలు లభించవు. అలా గుర్తించకపోవడమే నిజమైన ప్రమాదమ’ని మన్మోహన్ సింగ్ చెప్పారు.

అహ్లూవాలియా పుస్తకం గురించి మాట్లాడిన మన్మోహన్ సింగ్..2024 నాటికి ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడం కోరికే తప్ప మరొకటి కాదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారనే ప్రభుత్వ వాదనపై కూడా నమ్మకం లేదు. అలా ఆశించటానికి గల మార్గాలను పాలకవర్గం చూపించడం లేదనే విషయాన్ని అహ్లూవాలియా పుస్తకంలో ప్రస్తావించినట్టు మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. సాహసవంతమైన కొత్త సంస్కరణలు తీసుకోవాల్సిన అవసరముందని అన్నారు. రెండో తరం సంస్కరణలకు కొత్త మార్గాలను అన్వేశించాలి. వాటి కోసం పటిష్ఠమైన చర్చలు ఉద్భవించాలని మన్మోహన్ సింగ్ అన్నారు.

Advertisement

Next Story