ఏడేళ్లు గాఢంగా ప్రేమిస్తే.. దారుణంగా కొట్టించాడు

by Sridhar Babu |   ( Updated:2020-11-22 06:33:58.0  )
ఏడేళ్లు గాఢంగా ప్రేమిస్తే.. దారుణంగా కొట్టించాడు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ జంట ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అమ్మాయి కోరగా అబ్బాయి మొహం చాటేశాడు. ఈ క్రమంలోనే వేరే అమ్మాయితో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న భగ్న ప్రేమికురాలు న్యాయం కోసం అబ్బాయి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. అయితే, బాధితురాలు గోడు వినాల్సిన వారే అత్యంత పాశవికంగా ఆమెపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితురాలికి తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా మామడ మండలం కేంద్రంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. అడ్లూరి మనోజ్‌ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఏడేళ్లుగా తామిద్దరం గాఢంగా ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు మనోజ్ తనను మోసం చేశాడని ఆరోపించింది.అంతేకాకుండా వేరే అమ్మాయితో పెళ్లికి సైతం సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట మౌనదీక్ష చేపట్టగా యువతిని అతని బంధువులు చితకబాదారు. తీవ్రగాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రియుడు పరారీలో ఉన్నాడు. ఈ దాడిని యువతి కుటుంబ సభ్యులు, బంధువులు మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. న్యాయం కోసం తలుపు తడితే ఇంత కర్కషంగా ప్రవర్తిస్తారా అని యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed