నిశ్చితార్థం చెడగొట్టి మొహం చాటేసాడు.. ప్రియురాలు ఏం చేసిందంటే..!

by Aamani |
adilabad
X

దిశ, నిర్మల్ రూరల్ : ప్రియురాలి నిశ్చితార్థం చెడగొట్టడమే కాకుండా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడో ప్రియుడు. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు అతని ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతోంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రంలో సోమవారం వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. దిలావర్ పూర్‌కు చెందిన గడ్డం ప్రమోద్ రెడ్డి, రజిత గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తరఫు వారు పెళ్లికి నిరాకరించారు. అంతేకాకుండా, రజితకు నిజామాబాద్ జిల్లా గోందూరుకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం చేసి నిశ్చితార్థం సైతం జరిపించారు. విషయం తెలుసుకున్న ప్రియుడు గడ్డం ప్రమోద్ రెడ్డి తన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిన వ్యక్తి ఇంటికి వెళ్లి తాను రజిత ప్రేమించుకున్నామని, నీవెలా పెళ్లి చేసుకుంటావని నిలదీశాడు. దీంతో అబ్బాయి తరఫు బంధువులు పెళ్లిని తెగదెంపులు చేసుకున్నారు.

ఈ ఘటన అనంతరం బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరడంతో కొన్ని రోజులుగా ముఖం చాటేస్తూ వస్తున్నాడు. ప్రమోద్ రెడ్డి తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన రజిత బంధువులతో కలిసి అతని ఇంటి ముందు బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు, అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సమస్య పరిష్కారం కోసం పోలీస్‌ స్టేషన్‌కు రావాలని చెప్పడంతో తనకు ఇక్కడే పరిష్కారం కావాలని ప్రియురాలు పట్టబడుతోంది.రజిత ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించాలని ఆదివాసి నాయక్ పోడ్ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమయ్య, జిల్లా అధ్యక్షులు ముసలి చిన్నయ్య, మండల అధ్యక్షులు తోట రమాకాంత్, నాయకులు రాజు, సిద్ధార్థ, కుల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story