బాలలకో విజ్ఞాన మార్గదర్శి

by Ravi |   ( Updated:2023-11-27 00:00:38.0  )
బాలలకో విజ్ఞాన మార్గదర్శి
X

పుత్రోత్సాహము తండ్రికి/ పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ/ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! అని, ఆనాడు బద్దెన మహాకవి తన సుమతీ శతకంలో, ఒక ప్రయోజకుడైన కొడుకుని చూసినపుడు తండ్రి పొందే ఆనందాన్ని గూర్చి చక్కగా వివరించడం జరిగింది. కాకపోతే, ఆనాడు మహిళలు చదువుకోవడానికి అనర్హులనే భావనలో ఉండడం వలననో, లేక వంశోద్ధారకుడంటే పుత్రుడు మాత్రమేనన్న భావనతోనో... ఇలా ఈ పద్యాన్ని రచించి ఉంటాడని నా భావన. కానీ, ఈ నాటి కాలంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రకాల పనులను చేస్తున్నారు. కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్నారు. అది మనం కళ్ళారా చూస్తున్నాం కూడా. అంతేగాక, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే, స్త్రీల ఇంటి పేరు కూడా మారడంలేదు. (కాకపోతే, కావాలని మార్పించుకుంటే తప్ప) కనుక స్త్రీలు కూడా తండ్రికి వంశోద్ధారకులుగానే చెప్పుకునే రోజు నేడుందని అక్షర సత్యం.

నాటి నుండి నేటి వరకూ కూడా, సంగీత, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలతో పాటు, సినీ, రాజకీయ, అంతరిక్ష యానాలలో సైతం, ఏదైనా ఇంతి లేని రంగమున్నదా చెప్పండి. కాదేదీ కవిత కనర్హం అని ఆనాడు శ్రీశ్రీ గారన్నట్లు, ‘కారే ఏ రంగమున జూచినా స్త్రీలనర్హులు’ అని అనుకునే పరిస్థితి నేడు ఉంది. ఇలాంటి స్త్రీల కోవలోనికి చెందినవారే మన కవయిత్రి, విజ్ఞాన సరస్వతి అయిన డా. కందేపి రాణీప్రసాద్ గారు.

యువతకు విజ్ఞానం అందించాలనే..

నేటి విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి కూడా ‘పరిసరాల విజ్ఞానం’ అనే పుస్తకం ఒకటుందన్న మాటే కానీ, నిజంగా పరిసరాల గురించి వారికేమాత్రం అవగాహన కల్పించగలుగుతున్నారు అని ఆలోచిస్తే.. లేదనే చెప్పాలి. విద్యార్థులు పాఠశాలలో అడుగు పెట్టేనాటికి, వారి బుర్రల్లో పరిసరాల గురించి ఏ మాత్రం అవగాహన కలిగి ఉంటున్నారో, అదే అవగాహనతో మాత్రమే తరగతులు దాటిపోతున్నారని చెప్పక తప్పదు. అంతే తప్ప, ప్రాణులను ఏవిధంగా సంరక్షించాలని గానీ, వాటి వలన ప్రకృతి సమతుల్యత ఎలా కాపాడబడుతుంది అని గానీ, వాటితో మన అనుబంధం ఏమిటి? ఈ జీవరాశి అంతరించి పోతే మనకు కలిగే ప్రమాదం ఏమిటి? మరి అలా జీవరాశి అంతరించి పోకుండా ఉండాలంటే, ఏం చేయాలి లాంటి విషయాలేవీ ఉన్నత స్థాయి చదువులు పూర్తి చేసినప్పటికి కూడా ఏమాత్రం తెలుసుకోలేని పరిస్థితి. క్రికెట్ గురించి తెలిసినంతగా నేటి విద్యార్థులకు శాస్త్రవేత్తల గురించి తెలియదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అనేకమంది విద్యార్థులు డిగ్రీలైతే చదువుతున్నారూ.. పట్టాలైతే పుచ్చుకుని పట్టభద్రులు ఔతున్నారు. కానీ, తాము సంపాదించిన డిగ్రీలకు తగినంత విజ్ఞానం సంపాదిస్తున్నారా? అని వారు ప్రశ్న వేసుకుంటే చాలామంది ఆలోచనల్లో పడడం ఖాయం.

కారణాలు ఏవైనా, శాస్త్రీయ విజ్ఞానం పట్ల మన విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేము. ఈ పరిస్థితి నుండి విద్యార్థులు విముక్తి పొందాలంటే, నేటి యువతకు సరియైన విజ్ఞానం అందించాలి. ఇలాంటి ఆలోచనలతోనే డా. కందేపి రాణీప్రసాద్ గారు ఉండేవారు. స్వతహాగా విజ్ఞాన శాస్త్ర పండితులైన డాక్టర్ రాణీప్రసాద్ గారు, నిత్యం పిల్లలతో అనుబంధం కలిగిన వారు కూడానూ. విజ్ఞాన శాస్త్రంలో బాలల సాహిత్యంపై పరిశోధనలు చేసి డాక్టరేట్ కూడా సాధించారు. పిల్లల్లో పరిశీలనా శక్తి పెంపొందించాలి. వారిలో ఏదైనా సాధించాలనే పట్టుదల, జిజ్ఞాస కలుగజేయాలన్నదే వీరి తపన. నేడు మనం అనుభవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వెనుక ఎందరో ప్రపంచ మేధావులు, శాస్త్రవేత్తల కృషి దాగి ఉన్నది. అవన్నీ తెలుసుకుని, నేటి విద్యార్థుల నుండి భావి తరంలో అనేకమంది శాస్త్రవేత్తలను చూడాలన్న సదాశయానికి ప్రతిరూపాలే వీరి కలం నుండి వెలువడిన సైన్స్ పాయింట్, సైన్స్ కార్నర్, సైన్స్ వరల్డ్ అనే మూడు అత్యద్భుతమైన వ్యాస సంపుటాల సంకలనాలు.

విజ్ఞాన భాండాగారాలు..

వీటిలో తాననుకున్న విధంగా గొప్ప, గొప్ప శాస్త్రవేత్తలకు సంబంధించిన సమాచారాన్ని క్లాస్ రూమ్ టీచింగ్ ఓరియెంటెడ్‌గా మనతో మాట్లాడుతున్నట్లే., పాఠకుల్లో పరకాయ ప్రవేశం చేసి మరీ, ఆసక్తికరంగా ప్రతి ఒక్కరూ చదువగలిగే సరళమైన భాషలో రచించారు డాక్టర్ గారు. రేపటి అత్యద్భుతమైన నవ్య సమాజానికి నాంది పలకాలని, నేటి బాలలకు ఉపయుక్తమైన ఎన్నో సైన్స్ విషయాలను ఇందులో అందించారు. కాలుష్యం పట్ల అవగాహన, కాలుష్య భూతాల వలన కలిగే అనర్థాలు, మన ఇంట్లోనే ఉన్న కాకర, అల్లం, పసుపు, శొంఠి లాంటి వాటితో ప్రకృతి వైద్యం, చెట్ల వలన లాభాలనూ, పెద్దలను ఎలా అర్ధం చేసుకోవాలి అని తెలిపే నాటికలు చాలా చక్కగా పొందుపరచారు.

పెంగ్విన్, పెలికాన్, స్టార్క్, సీలయన్స్, జీబ్రాల వంటి జంతువులు వింతలు విశేషాల సమాహారాలతో పాటు, ఆరోగ్యానికి చిరునవ్వు ఎంత ప్రాముఖ్యమైందో తెలిపే విశేషాలు కూడా చాలా చక్కగా అందించారు. నేడు మానవ ప్రపంచమంతా రోజుకో కొత్త జబ్బుతో బాధపడుతూ ఉండడం పరిపాటి అయింది. దానికి కారణం పోషకాహార లోపం ఒకటైతే, మరొకటి కాలుష్యం. మనిషి నాగరికత పేరుతో రకరకాల కాలుష్యపు కోరల్లో చిక్కుకుని, విలవిల్లాడుతూ... తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారనే ఆవేదన వీరిది. కానీ, ప్రస్తుత సమాజంలో కేవలం పరీక్షల కోసం, ర్యాంకుల కోసమే సైన్స్‌ను చదువుతున్న పరిస్థితి నేటి విద్యార్థులది. అంతేగాని, సూక్ష్మజీవుల వలన మనకు కలిగే లాభం ఏమిటి ఎవరూ మొక్కలు నాటకుండానే అడవుల్లో చెట్లు ఎలా వస్తున్నాయి వన్యప్రాణులను ఎలా సంరక్షించాలి అలా చేయకుంటే మన జీవనానికి కలిగే నష్టం ఏమిటి? ఇలాంటి జీవరాశినంతటినీ మనం ఎలా కాపాడుకోవాలి? కాపాడకపోతే ఏమౌతుంది ఇలాంటి అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలతో విద్యార్థులను పుస్తకంలో ఆసక్తికరంగా విహరింవేపేలా ఈ చిరు విజ్ఞాన భాండాగారాలను రూపుదిద్దారు కవయిత్రి రాణీప్రసాద్ గారు.

సైన్స్ పట్ల పిల్లలకు మక్కువ కలిగించేందుకు నిత్యం తపించే వ్యక్తి వీరు. విద్యార్థి జీవితంలో జరుగుతున్న పరిసర విజ్ఞాన లోపాన్ని పూరించడానికి చేసిన ప్రయత్నాలే ఈ పుస్తకాలు. సరళ సుందరంగా, ఏకబిగిన చదివించ గలిగేలా రచింపబడిన వీటిలోని వ్యాసాలు ఎన్నో ఈ పుస్తకాలలో దాగున్నాయి. ఈ విజ్ఞాన విశేషాలు విద్యార్థులలో పరిశీలనా శక్తిని పెంపొందించడానికి తొలిమెట్లు. ఇలా బాలలకోసం వీరు చేస్తున్న కృషి చూశాక, మొదట్లో బద్దెన మహాకవి రచించిన పద్యాన్ని సరిగ్గా డా. రాణీప్రసాద్ గారికి సరిగ్గా నేను మార్పు చేసి సరిపోయేలా తిరగ రాయాలని అనిపించింది. తనయోత్సాహము తండ్రికి/ తనయది జన్మించినపుడె దక్కదు, జనులా/ తనయను గనుగొని పొగడగ/ తనయోత్సాహంబు నాడు దక్కు నిజంబౌ!

(ఈ పుస్తకాలు ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యం)

సమీక్ష

మద్దిరాల శ్రీనివాసులు

9010619066

Advertisement

Next Story