ఇది హై డర్రు బాద్

by Ravi |
ఇది హై డర్రు బాద్
X

భాగ్యనగరం, బహుళ అంతస్తుల

సుందర నగరం

వీధులన్నీ డ్రైనేజ్ మయం

వినతి కెక్కిన విశ్వ నగరం

చిరు జల్లులకే.. వీధులన్నీ జలమయం

రాష్ట్ర రాజధాని,

రాజకీయ నాయకుల రచ్చ బండ

రహదారులన్నీ గోతుల మయం

హైదరాబాద్.. హైరానా

అంతా ఆదరా బాదరా..

ఉరుకుల పరుగుల జీవితం

పలకరింపు లేని ప్రజానీకం

అర్ధరాత్రి దాటిన, నిద్రవోని జనం

మిట్ట మధ్యాహ్నం అయినా, నిద్ర లేవని జనం

అదే హై టెక్కు..

రాత్రి రెండు గంటలకు, వీధుల్లో టిఫిన్లు..

ఇంటి వంటకి చెక్, వీధి వంటే పసందు..

బతుకు కోసం బస్తీకి

వలసల జనం

భద్రత లేని భాగ్య నగరం

కడుపు నింపుకోవడానికి

లేదు బెంగ, ఏ గుడి ముంగిటో

ఆసుపత్రి ఎదుటనో, రోడ్డు పక్కో కూర్చుంటే చాలు

ఆకలి తీర్చే మహానుభావులెందరో..

భిన్న సంస్కృతుల భాగ్య నగరం

కొందరికి బట్టే బరువైతే

మరి కొందరి గుర్తింపే గగనం

స్వేచ్ఛా పావురాలకు ఇష్టా రాజ్యం..

ఇంటి నుండి వెళ్లి

ఇంటికి వచ్చే వరకు బిక్కు బిక్కు

భీతిగొలిపే సంఘటనలకు పెట్టినిల్లు..

ఆకతాయిలకు పుట్టినిల్లు.

నల్లని తారు రోడ్లపై రయ్యు రయ్యు మని

పోటి పడి పరుగెత్తే వాహనాల రణ గొన ధ్వనులకు

చెవులు చిల్లులు పడు చికాకు నగరం.

కాలుష్యపు మబ్బుల చాటున

చుక్కలు కనిపించని ఆకాశం.

కిక్కిరిసిన ట్రాఫిక్ లో

గంటల కొద్దీ సమయం వృధా

అదే సగటు జీవి వ్యధ, ఆపదలో

అంబులెన్స్‌కు దారి లేని అందాల నగరం.

గల గల పారే, వయ్యారి మూసి

పరిశ్రమల వ్యర్థాల జలరాశి..

ముక్కు పుటాలు అదిరే

సుగంధపు పరిమళాల మసి..

ఆకాశ సౌదాల సోయగం, ఏ గల్లీలో చూసిన

ఇంటా బయటా వాహనాలే

ఇరుకు గల్లీలో.. ప్రయాణం కత్తి మీద సామే.

గుడులూ,పార్కులు ప్రేమ పక్షులకు నిలయాలు

వారి వికృత చేష్టలకు పబ్బులు ఫామ్ హౌజులు

విల్లాలే విష సంస్కృతికి కేంద్రాలు.

నా భాగ్యనగరం, మహోన్నత చరిత గల

చారిత్రక నగరం చార్మినార్, మక్కా మజీద్

గోల్కొండ, గండిపేట

ఎన్నెన్నో దర్శనీయ స్థలాల

కమనీయ నగరం..

అంతా అద్భుత చరిత్ర

అదంతా గతం

ఇప్పుడంతా గందర గోళం

కిక్కిరిసిన కాంక్రీట్ జనారణ్యం

ఎవరి గోల వారిదే

ఎవడి బాధ వాడిదే...

శిరందాస్ శ్రీనివాస్

94416 73339

Advertisement

Next Story

Most Viewed