నిరంతర సాధన ద్వారానే ప్రావీణ్యత

by Ravi |   ( Updated:2023-05-28 19:15:28.0  )
నిరంతర సాధన ద్వారానే ప్రావీణ్యత
X

మనిషి తను కోరుకున్న ఏ రంగంలోనైనా ప్రావీణ్యత సాధించాలంటే నిరంతరం శ్రమించాల్సిందే. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే సాధన ఎల్లవేళలా అవసరమే. క్రీడాకారుడైన, కళాకారుడైనా చిత్రకారుడైన, శిల్పకారుడైనా ఏ సృజనకారునికైనా తన పనిమీద తనకు ప్రాక్టీస్ లేకపోతే ఆగిపోయినట్టే. సంగీతకారులు, గాయకులు, మిమిక్రీ కళాకారులు డప్పు వాయిద్య కళాకారులు ఆఖరుకు ఏ వృత్తిలోని వారైనా ఆ వృత్తిలోని మెలకువలు రోజురోజుకు మారుతున్న అప్‌డేట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే నిరంతరం ప్రాక్టీస్ ఉంటేనే మనిషి మెదడు అట్లనే పనిచేస్తది. రాయడం కూడా అంతే. కథలు, కవిత్వం, వ్యాసాలు ఏదో ఆమాసకు, పున్నానికి రాస్తాను అంటే కుదరదు చెయ్యిలోంచి అక్షరాలు రాలవు. చదవాలంటే కూడా మధ్య వయసుకు చేరిన తర్వాత అలవాటు బందై ఓ 50 పేజీలు చదవాలంటే కళ్ళు సహకరించకపోవచ్చు.

ఇంతెందుకు యాభై సంవత్సరాల కిందితరం ఏ పనికి పోవాలన్నా నడిచి వెళ్ళేవారు లేదా సైకిల్ మీద వెళ్ళేవారు. ఇప్పుడు సైకిల్ రెండు కిలోమీటర్లు నడిపితే చెమటలు కక్కుడే అవుతది. శరీరానికి కష్టం దూరం చేసినంక అంతే. అందరూ యంత్రాల మీద అలవాటు అయినంక దేహం తన పని నిర్వర్తనలో గాడి తప్పుతది. ఓ ఇరవై ఏండ్ల కింద అందరికీ ల్యాండ్ ఫోన్ నెంబర్లు జ్ఞాపకం ఉండేటివి. కనీసం రెగ్యులర్‌గా చేసే 20,30 నెంబర్లు అయినా గుర్తుండేటివి. ల్యాండు ఫోనులు అటకు ఎక్కినంకా సెల్‌ఫోన్ లోనే పేరు కనపడంగనే ఇగ నెంబర్ ఎక్కడ జ్ఞాపకం ఉంటది. అట్లనే ఇదివరకు ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా మనకు కావాల్సిన సామానులు ఇచ్చి కాయితం మీద రేట్లువేసి నోటితోనే జమచేసి మొత్తం ఇంత అని చెప్పేవారు. అందరికీ ఎక్కాలు వచ్చుకాని వాల్లకు ప్రాక్టీస్ ఉండేది. రాను రాను క్యాలిక్యులేటర్లు వచ్చిన తర్వాత జమ తీసివేత కూడా రావడం లేదు.

వృత్తినైనా ప్రవృత్తినైనా నిరంతరం అలవాటులో ఉంచుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు కవిత్వం రాస్తానంటే కవిత్వం కళాత్మకంగా రాకపోవచ్చు. ఎప్పుడూ చదవడం, అధ్యయనం రాయడం ఉండాల్సిందే. క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్లు, నృత్యాల పోటీలో పాల్గొనే కళాకారులు ఇంకే ఇతర క్రీడా కళారంగాల వాళ్లు ఎవరైనా కొనసాగింపు ఉండాల్సిందే. అట్లా చేయడం వల్లనే ఆ రంగంలో నిలదొక్కుకున్న వాళ్లం అవుతాం. వైద్యులైనా కూడా అంతే... అప్‌డేట్ నాలెడ్జ్ లేనిది వైద్యం చేయలేరు. ఏదైనా సాధన చేయడం సృజనాత్మకంగా ఆలోచించడం, శ్రమించడం దానికోసం సమయం కేటాయించడం చేస్తేనే ఆ రంగంలో శిఖర స్థాయిలో ఉండవచ్చు.

అన్నవరం దేవేందర్

94407 63479


Advertisement

Next Story