Singareni: గతాని కంటే వెయ్యి కోట్ల అధిక లాభం

by Gantepaka Srikanth |
Singareni: గతాని కంటే వెయ్యి కోట్ల అధిక లాభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి(Singareni) సంస్థ బొగ్గు అమ్మకం ద్వారా రూ.17,151 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ. 2,286 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసినట్టు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్(CMD Balaram) తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు బొగ్గు, థర్మల్ విద్యుత్ అమ్మకాల ద్వారా పన్ను చెల్లింపునకు ముందు రూ.4 వేల కోట్ల స్థూల లాభాన్ని కంపెనీ ఆర్జించిందన్నారు. గతేడాది ఇదే సమయానికి రూ.2,932 కోట్ల కు రూ.1,072 కోట్లు అదనం కావడం విశేషమని ఆయన అన్నారు. గతేడాదితో పోల్చితే స్థూల లాభం పై 36శాతం వృద్ధి నమోదైందన్నారు. ఇదే స్ఫూర్తితో వార్షిక ఉత్పత్తి లక్ష్యం 720 లక్షల టన్నులను సాధించాలని సింగరేణి అధికార యంత్రాంగం పనిచేస్తున్నట్టు వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అత్యధిక లాభాల వాటా రూ.796 కోట్ల ను చెల్లించేలా ఆదేశాలిచ్చారన్నారు. దీపావళి బోనస్ రూ.358 కోట్లను చెల్లించి సింగరేణి కార్మికుల రక్షణకు ప్రత్యేక చొరవ చూపి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారన్నారు. కార్మికుల రక్షణకు రూ. కోటి ప్రమాద బీమా కార్మికుల్లో ధీమాను పెంచిందన్నారు. గతంలో ఎవరూ నిర్వహించని సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని గనుల రక్షణ కమిటీలు, పిట్ కమిటీలు, వర్క్ ఇన్స్పెక్టర్లలతో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించినట్టు వెల్లడించారు. రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలో మొత్తం 599 మంది కొత్త ఉద్యోగులను ఈ నెలలో నియమించబోతున్నామన్నారు.

అన్ని ఏరియాల్లోనూ కంపెనీ యంత్రాల వినియోగాన్ని 14 గంటల నుంచి 20 గంటల వరకు పెంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. మణుగూరు, రామగుండం-1, ఇల్లందు, కొత్తగూడెం, ఆర్జీ-3, ప్రొడక్షన్ డే నిర్వహిస్తూ యంత్రాల వినియోగాన్ని 20 గంటల వరకు పెంచగలిగినట్టు సింగరేణి సీఎండీ బలరామ్ తెలిపారు. వర్షాకాలంలో రోజుకు లక్ష టన్నులకు పడిపోయిన ఉత్పత్తి పుంజుకుని ఇప్పుడు 2.2 లక్షల టన్నులకు చేరుకుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 5 నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా ముందుకు సాగుతున్నామన్నారు. పటిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తూ అంకిత భావంతో కూడిన కార్మికులతో ఉత్పత్తిని పెంచి అత్యధిక లాభాలను తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story