- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
- Union Budget 2025-2026
భిన్న మత సంస్కృతుల సమ్మేళనం - గిరిజా పైడిమర్రి
దిశ, వెబ్ డెస్క్ : పని మీద ఏ ప్రదేశానికి వెళ్లినా కాస్త వెసలుబాటు చేసుకొని చుట్టుపక్కల ప్రదేశాలు చూడడం నాకు అలవాటు. చైతన్య మహిళా సంఘం సమావేశం, అయాజ్రూహిల నిఖాకు హాజరు కావడం కోసం విజయవాడ వెళ్ళాను. ఉదయమే ట్రెక్కింగ్ కు కొండపల్లి వెళ్ళాలని అనుకున్నాము. మీటింగ్ తరువాత GTK మిత్రుడు పుల్లారావు గారిని సంప్రదించాను. ఆయన కొండపల్లికి కొత్తవాళ్ళు మాత్రమే వెళితే దారితప్పే ప్రమాదముందని చెప్పి గుణదల ట్రెక్‌కు వెళ్ళమని సూచించారు. అవసరమైతే ఉంటుందని రాముగారి కాంటాక్టు నంబరు ఇచ్చారు. నేను, అనిత, కాంతి, రాధ, మంజరి ఉదయం 5.15 ని.లకు ఆటోలో బయలు దేరాము. 15 నిమిషాల దారి. ఒక పక్కన చాలా మంది నిద్రపోతున్నారు. గేటుకి తాళం వేసి ఉంది. ఎలా వెళ్ళడమా? అని ఆలోచిస్తున్నంతలో ఒకావిడ వచ్చి పైకి వెళతారా? అంటూ గేట్ తెరిచింది. రోజూ 5.30 కు గంటమోగినప్పుడు గేట్ తెరుస్తారట. మేము సరైన సమయానికే చేరుకున్నాము.
నిశీధిలో గుణదల మిలమిల
ఇంకా ఆకాశంలో మబ్బు తెరలు వీడలేదు. మంచు కురుస్తోంది. ఐదుగురు మహిళలం మాత్రమే ఆ తొలి నిశీధిలో కొండ ఎక్కడం మొదలు పెట్టాం. కొంత మేర పైకి ఎక్కాక మిలమిల మెరుస్తున్నాయి. విద్యుద్దీపాల కాంతిలో ' గుణదల ' అనే అక్షరాలు. మరో రెండు మూడు మలుపులే ఉన్నాయి అంటూ... అక్కడక్కడా విశ్రాంతి తీసుకుంటూ.... ఆహ్లాదకరమైన ఆ ఉదయపు వేళలో ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళలో నింపుకుంటూ... ఊపిరి తిత్తుల నిండా ప్రాణ వాయువును పదిలపరచుకుంటూ మా ప్రయాణం సాగింది. డెబ్భై యేళ్ళ మంజరి గారు కూడా మాతో ఉండడం ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది.
దక్షిణాదిలో అతిపెద్ద చర్చి గుణదల
గుణదల విద్యుద్దీపాల అక్షరాలున్న కొండపైకి చేరుకున్నాము. ఎదురుగా చిన్నగుహలో మేరీమాత విగ్రహం ఉంది. ఇది ఫ్రాన్సు దేశంలోని లార్దునగరం చర్చిలో ఉన్న మేరీ మాత విగ్రహం లాగా ఉందని స్థానికులు చెప్పారు. రెండు చోట్ల మేరీమాత విగ్రహం గుహలో ఉంది. దక్షిణభారత దేశంలో ఉన్న పెద్ద చర్చిలలో ఇది ఒకటి. 1924 నుంచి ఫిబ్రవరి 11వ. తేదీన మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయట. ఇటీవల కాలంలో 9,10,11 మూడు రోజులకు ఆ ఉత్సవాలను పెంచారట. క్రిస్మస్ సమయంలో కాకుండా ప్రత్యేకంగా ఫిబ్రవరి 11 న ఉత్సవం జరపడం వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం నేను అలాంటి కథలను ఇక్కడ ప్రస్తావించదలచ లేదు. మేము గమ్యస్థానానికి చేరుకున్నామనే ఆనందంతో అక్కడ సేదతీరుతున్నాము.
క్రైస్తవుల పుణ్యక్షేత్రం
ఇంతలో మా ముందునుంచి ఒక యువ జంట ఆ కొండ వెనుకగా వెళ్ళిపోయింది. ఇంకా మేము గమ్య స్థానం చేరుకోలేదనే విషయం మాకు అర్థం అయింది. అంతే... మేము కూడా లేచి ఆ కొండ వెనకగా నడక మొదలు పెట్టాము. అప్పుడు మొదలైంది. బల్లపరుపుగా ఉన్న రాతికొండ. దానిని తొలిచిన రెండు మూడు మెట్లు అక్కడక్కడా ఉన్నాయి. కుడి వైపు లోయ. దానికి అల్లంత దూరాన బెజవాడ నగరం. ఎడమవైపు ఏసుక్రీస్తు పుట్టుక నుంచి శిలువ...మరణం వరకూ తెలియజేసే విగ్రహాలు ఉన్నాయి. ఆ పైన 18 అడుగుల శిలువ ఉంది. అక్కడినుంచి చూస్తే ఆ కొండ చుట్టూ పరివేష్టితమైన విజయవాడ నగరం కనిపిస్తుంది. అడపాదడపా ఒకరిద్దరు వచ్చి, శిలువ ముందు మోకరిల్లి, మౌనంగా రెండు నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళి పోయారు. క్రైస్తవులకు గుణదల పుణ్యక్షేత్రం. మా లాంటి ప్రకృతి ప్రియులకు ట్రెక్కింగ్ ప్రదేశం. మరో మార్గంలో కొండ దిగి ఆటోలో ఇల్లు చేరేసరికి తొమ్మిదైంది.
మిత్రులు ఫోన్ చేయడం వలన నేను అదే ఆటోలో వెళ్ళపోయాను. GRT Gardenలో పెళ్లివారు మాకు బస ఏర్పాటు చేసారు. మిత్రులు సిద్ధంగా ఉన్నారు. అమరావతి నలభై యేళ్ళ క్రితం నా విద్యార్థి దశలో వెళ్ళాను. మళ్ళీ ఇలా సహోద్యోగులతో.... నేను, అరుణ, రవళి,భారతి, పద్మజ, సుజాత, పద్మ ఏడుగురు మహిళలం ఇన్నోవా కారులో బయలు దేరాము.
పంచారామాలలో ఒకటి.. అమరావతి
విజయవాడ నుంచి అమరావతికి గంటన్నర ప్రయాణం. గుంటూరు జిల్లాలో ఉన్న శైవ క్షేత్రం. కృష్ణానదీ తీరంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటి. ఇక్కడ ఉన్న శివలింగం 15 అడుగుల ఎత్తులో ఉంది. అది పెరుగుతుండడం వలన దానిని ఆపడానికి తల పైన ఒక మేకు కొట్టారనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఇలా శిలలు పెరగడానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. పూజారి పైకి ఎక్కి అభిషేకం చేస్తాడట. ఎదురుగా నంది గంభీరంగా ఉంది. అక్కడ కొలువైన అమరలింగేశ్వర ఆలయం పేరు మీదుగా ఆ గ్రామానికి అమరావతి అనే అనే పేరు వచ్చిందట. అది అతి పురాతనమైన చారిత్రక ప్రదేశమని శాసనాల వలన తెలుస్తోంది. తొలి ఆంధ్ర రాజులైన శాతవాహనులకు రాజధాని. వారిలో ప్రసిద్ధుడైన గౌతమీ పుత్ర శాతకర్ణి కాలంలో( క్రి. శ. ఒకటో శతాబ్ధం) చాలా ప్రసిద్ధి పొందింది. ఆ కాలంలో జైన, బౌద్ధ మతాలకు పేరు గాంచింది. గౌతమ బుద్ధుడు అక్కడినుంచే తన కాలచక్ర ప్రక్రియను బోధించాడు. కాబట్టి అమరావతి బుద్ధుడి కంటే ప్రాచీనమైందని చారిత్రకంగా రుజువైంది. అమరావతి ప్రాచీన నామం ధాన్యకటకం లేదా ధరణికోట.
పురాతనమైన భ్రమరాంబ దేవాలయం
అక్కడి నుంచి మేము పెద్ద కాకానికి గ్రామానికి వెళ్ళాము. విజయవాడ నుంచి 26 కిలోమీటర్ల దూరం. అక్కడ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం ఉంది. అది సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనమైనది. దేవాలయానికి సంబంధించి కాకాసురుని శాప విమోచన కథ ఒకటి ప్రచారంలో ఉంది. అందుకే ఆ గ్రామానికి పెదకాకాని అనే పేరు వచ్చిందని గ్రామస్థులు చెప్పారు. అక్కడ లభించిన ఒక శాసనం వలన రుద్రమదేవి కాలంలో ఆత్రమల్లుడనే సామంతరాజు తన తల్లిదండ్రులు సీరియమ్మ, బాబినాయనల పేరు మీద ఆ ఊరిలోని గోపాల దేవునికి భూదానం చేసినట్లు ఉంది.తరువాత ఆ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పునరుద్ధరించాడని చారిత్రక ఆధారాలున్నాయి. ఆయన అక్కడి దేవుడిని పూజించి సంతానాన్ని పొందాడనే కథ ప్రచారంలో ఉంది. ఆలయానికి తూర్పు దిక్కులో ఒక బావి ఉంది. భరద్వాజ మహర్షి పవిత్ర నదుల జలాన్ని తెచ్చి ఆ బావిలో పోశాడని, ఆ నీటిని తాగితే అన్ని రోగాలు తగ్గుతాయని ప్రజల నమ్మకం. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు మేము విజయవాడ చేరుకున్నాము. భోజనం చేసి కాసేపు విశాంతి తీసుకున్నాము.
పాలకుల చేతులు మారిన మంగళగిరి
తర్వాత మేము మంగళగిరి వెళ్ళాము. ఆ దేవాలయాన్ని ధర్మరాజు స్థాపించాడని చెపుతారు. దానికి ఆధారం బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్న కథ. చారిత్రక ఆధారాలను బట్టి మంగళగిరికి అతి పురాతనమైన చరిత్ర ఉంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్య రాజవంశాలు మంగళగిరిని పాలించినట్లు ఆధారాలున్నాయి. తర్వాత మంగళగిరి కాకతీయుల పాలనలోకి వచ్చింది. కొంత కాలానికి ఢిల్లీ సుల్తానుల వశమైంది. పిదప రెడ్డిరాజుల అధీనంలోకి వచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటి శాసనం వలన ఆ దేవాలయాన్ని విజయనగర రాజులు పోషించినట్లు తెలుస్తోంది. 1565 తళ్లి కోట యుద్ధంతో విజయనగర రాజ్యం పతనం తర్వాత మంగళగిరిని గోల్కొండ కుతుబ్ షాహీలు పరిపాలించారు. అనంతరం 1758 నుంచి దాదాపు 30 యేళ్ళు నిజాం పరిపాలనలో ఉంది. 1788 సెప్టెంబర్ 18న నిజాం అలీఖాన్ గుంటూరును బ్రిటిష్ వాళ్ళకు అప్పగించాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతానికి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడిని జమీందారును చేశారు. ఆయన తర్వాత పదకొండు అంతస్తుల ఎత్తైన గాలి గోవురాన్ని నిర్మించాడట. అది దక్షిణ భారతదేశంలో ఉన్న ఎత్తైన గోపురాలలో ఒకటి. రాష్ట్రంలోనే ఎత్తైనది. ఎత్తు 157 అడుగులు. వెడల్పు 49 అడుగులు. చూపరులను అల్లంత దూరం నుంచి ఆకర్షిస్తుంది. కొండ పైకి 320 మెట్లు ఉన్నాయి. కొండపై వరకూ వాహనాలలో కూడా వెళ్ళవచ్చు.
కింద లావా.. పైన పానకం.. మంగళగిరి
మంగళగిరి ముగ్గురు నరసింహ స్వాములకు నిలయం. కొండపైన పానకాల నరసింహస్వామి, గండాల నరసింహ స్వామి, కొండ కింద లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలుంటాయి. పానకాల నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా విగ్రహం ఉండదు. నోరు తెరచి ఉన్నట్లుగా ఒక ఆకారం మాత్రమే ఉంటది. దానికి వెండి తొడుగు ఉంది. భక్తులు సమర్పించిన పానకాన్ని పూజారులు ఆ రంధ్రంలో పోస్తుంటారు. అవి ఎటు వైపు నుంచి బయటకు రాకుండా నేరుగా లోపలికే పోవడం విశేషం. భక్తులు దానిని ఒక మహిమగా భావిస్తారు. అయితే దానికి ఒక శాస్త్రీయమైన కారణాన్ని కూడా శాస్త్ర వేత్తలు చెప్పారు. వాళ్ళ పరిశోధనల ప్రకారం మంగళగిరి కొండ లావా గర్భితమైనదని, గంధపు (సల్ఫర్) నిలువలు ఉన్నాయని, అవి ఏ క్షణమైనా ప్రజ్వలించే ప్రమాదం ఉందని.... దానిని నివారించడానికి కొండను చల్లబరచడమొక్కటే మార్గం కాబట్టి అనాదిగా సాంప్రదాయం, నమ్మకం పేరిట జరుగుతున్న పానకం సమర్పణ దానికి రక్షణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కారణం ఏదైనా ఒక ప్రకృతి ప్రమాదం జరుగకుండా ఆపుతోంది పానకం సమర్పణ. అందుకే పానకాల నరసింహ స్వామి అనే పేరు వచ్చింది.
నిఖా కూడా మన పెళ్లి లాంటిదే
మంగళగిరి చేనేతకు కూడా ప్రసిద్ధి. ఒకప్పుడు కాటన్ వరకే పరిమితమైన చేనేత కళాకారులు కొంత అభివృద్ధిని అందిపుచ్చుకొని ఈ మధ్య పట్టు చీరలు కూడా నేస్తున్నారు. వారిని ప్రోత్సహించడంలో భాగంగా మేము చేనేత చీరలు కొన్నాము. ముస్లిం సాంప్రదాయంలో కూడా హల్దీ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం బాగుంది. వధూవరులిద్దరూ (అజాజ్ రూహి) కలిసి జరుపుకోవడం మరింత బాగుంది. నిఖాలో వధూవరుల మధ్య అడ్డుతెర పూలతో ఏర్పాటు చేసారు. వరుడి కాళ్ళు కాకుండా చేతులు కడగడం, అత్తగారు నల్లపూసలు కట్టడం లాంటి ఇస్లాం వివాహ పద్ధతులు మొదటిసారి దగ్గరనుంచి గమనించాను. ఈ రకంగా నా విజయవాడ ప్రయాణం భిన్న మత సంస్కృతుల పరిశీలనకు దోహదం చేసింది.
ఇంకా ఉంది.
గిరిజా పైడిమర్రి
ట్రావెలర్
99494 43414