HYD: బల్దియాకు మొండిచేయి..! బడ్జెట్‌లో కేటాయింపులు నిల్

by Ramesh Goud |
HYD: బల్దియాకు మొండిచేయి..! బడ్జెట్‌లో కేటాయింపులు నిల్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : దేశ ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో శనివారం ఎనిమిదవసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానంగా రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపునివ్వడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా విద్యారంగానికి ఆశించిన మేర నిధులు కేటాయించకపోవడం పట్ల విద్యార్థి లోకం మండిపడుతోంది. మరోవైపు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉందని, ఇది ప్రజా బడ్జెట్ అని బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు బడ్జెట్ పై పెదవి విరుస్తున్నారు. కేవలం ఎన్నికలున్న రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన బడ్జెట్ అని విమర్శిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మెట్రో రెండవ దశ నిర్మాణ పనులకు, మూసీ పునరుజ్జీవం వంటి వాటికి నిధులు కేటాయించకపోవడం పట్ల ప్రజల నుంచి కూడా విముఖత ఎదురౌతోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుగా నిలిచినప్పటికీ రాష్ట్రానికి కేటాయింపులు జరుగకపోవడం బాధాకరమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణకు ఆశాజనకంగా లేదు.. కారం రవీందర్ రెడ్డి, టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు

కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన వృత్తి పన్ను స్లాబ్‌లు ఉద్యోగులకు, పెన్షనర్లకు ఉపశమనం కలిగించింది. పెన్షన్ అనేది ఆదాయంగా పరిగణించకుండా 30 సంవత్సరాల సేవలకు గుర్తింపుగా చెల్లిస్తున్న రిలీఫ్‌గా భావించి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిరాశను కలిగించింది. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా నాన్చుడు ధోరణి పట్ల ఉద్యోగులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ బడ్జెట్ తెలంగాణకు ఆశాజనకంగా లేదు.

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం.. ప్రవీణ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి

2025-26 బడ్జెట్ పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే అన్ని వర్గాలకు సమన్యాయం చేసే డ్రీమ్ బడ్జెట్. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన బడ్జెట్. వ్యక్తిగత ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిని రూ.12 లక్షలకు పెంచడం పెద్ద నిర్ణయం. ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు ఆపన్నహస్తాన్ని అందించిన బడ్జెట్. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించిన బడ్జెట్ ఇది. అన్ని సంక్షేమ పథకాలకు నిధులను పెంచడం అభినందనీయం.

కార్పొరేట్ ప్రయోజనాల దిశగా బడ్జెట్.. ఆర్.శ్రీనివాస్, సామాజిక కార్యకర్త

కేంద్ర బడ్జెట్ ప్రజల ప్రాథమిక అవసరాల తీర్చుట కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉన్నది. అదేవిధంగా, విద్యా, ఉపాధిలో పెరుగుతున్న అసమానతలను అడ్రస్ చేయకపోవడం బాధాకరం.

బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యి.. కాంపల్లి శ్రీనివాస్, సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చేయి చూపించింది. 8 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నప్పటికీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపడం లేదు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు వరాలు కురిపిస్తూ, తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు మొండి చెయ్యి చూపించడం తీరని అన్యాయం.

విద్యా రంగానికి తీరని లోటు.. కోట శ్రీనివాస్, ఓయూ పరిశోధక విద్యార్థి

ఈ బడ్జెట్ విద్యా రంగంలో తీరని లోటు మిగిలిస్తుంది. విద్యను ప్రయోజనవంతంగా అభివృద్ధి చేస్తున్నామనే ప్రచారం ఉన్నప్పటికీ, వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. జీడీపీలో విద్య రంగానికి కేటాయింపు 6 శాతం ఉండాలి కాని, బడ్జెట్‌లో కేవలం 2.8 శాతం మాత్రమే కేటాయించారు. నిరుద్యోగానికి సరైన పరిష్కారం లేదు.

విద్యార్థి వ్యతిరేక యూనియన్ బడ్జెట్.. నెల్లి సత్య, ఓయూ పరిశోధక విద్యార్థి

విద్యారంగానికి బడ్జెట్లో నిధులు పెంచక విద్యార్థి వ్యతిరేక బడ్జెట్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వ నిధులు పెంచాలని విద్యార్థి సంఘాల, మేధావులు, ప్రొఫెసర్లు విన్నవించినప్పటికి ప్రభుత్వ విద్య కోసం నిధులలో ఆశించినంత పెరుగుదల లేదు.

పన్ను మినహాయింపు అభినందనీయం.. ఎం.అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్

2024-25 బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపులు ప్రతిపాదించడాన్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, పాత రెజ్యూమ్‌లో ఎలాంటి పెంపుదల లేకపోవడం సరికాదు. దీని వల్ల గృహ నిర్మాణ రంగం, హెల్త్ ఇన్సూరెన్స్, జీపీఎఫ్‌లో పొదుపు, ఉన్నత విద్యా రుణాలను నిరుత్సాహపరిచేరకంగా ఉంది. రూ.12 లక్షల ఆదాయం పైన వారికి రూ.4 లక్షల నుంచే తిరిగి పన్నును ప్రభుత్వం రాబడుతుంది. ఇది కనీసం రూ.5 లక్షలకు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.2 లక్షలకు పెంచాలి. ఇది కేవలం పాత రేజ్యూమ్ నుంచి కొత్త రెజ్యూమ్‌కు మార్చే ఎత్తుగడలో భాగమే.

గ్రేటర్‌కు నిధులేవి...? కడ్లి రాజశేఖర్, న్యాయవాది

గ్రేటర్ హైదరాబాద్‌కు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి మొండిచెయ్యి చూపింది. రెండవ విడత మెట్రో నిర్మాణానికి, మూసీ నది పునరుజ్జీవనానికి అసలే నిధులు కేటాయింపు జరగలేదు. కేవలం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ ఇది. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపునివ్వడం గుడ్డిలో మెల్లెలా ఉంది.

ఇద్దరు కేంద్ర మంత్రుల అసమర్ధత.. మెట్టు సాయికుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్

కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రాతినిథ్యం వహిస్తున్నా తెలంగాణ వంటి చిన్న, కొత్త రాష్ట్రాలకు ఆశించిన మేర నిధుల కేటాయింపు చేయలేదు. మెట్రో రెండవ దశ, మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలని సీఎ: రేవంత్ రెడ్డి కోరినా ఫలితం లేకుండాపోయింది. తెలంగాణకు నిధుల కేటాయింపుపై కేంద్రం పక్షపాతధోరణి అవలంభిస్తోంది. ఇది నిజంగా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల అసమర్ధత.

విభజన హామీలు లేవు.. దేవీ ప్రసాదరావు, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్

కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశ పరిచింది, బడ్జెట్‌లో బీజేపీ పాలిత బీజేపీ సహకారం ఉన్న రాష్ట్రాల పేర్లు తప్ప ఇతర రాష్ట్రాల పేరేత్తకపోవడం దారుణం. తెలంగాణ రాష్ట్రానికి రావలసిన విభజన హామీలు ఏమి లేవు, కేటాయింపులు లేవు, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కేంద్రం నెరవేర్చలేదు. 16 మంది ఎంపీలలో కాంగ్రెస్ బీజేపీలకు చెరి 8 ఇచ్చినా తెలంగాణకు దక్కింది శూన్యం. ఢిల్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు అనివార్యంగా టాక్స్ స్లాబ్లు పెంచడం స్వాగతిస్తున్నాం. కార్పొరేట్స్‌కు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్న బీజేపీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేము. బీఆర్‌ఎస్ పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంట్‌లో లేకపోవడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అనే విషయాన్ని గుర్తించి తగిన కేటాయింపులు చేయాలి.

అన్ని రంగాలవారికి ఆమోదయోగ్యం.. రాకేశ్ జైస్వాల్, జాంబాగ్ కార్పొరేటర్

విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో పాటు పేద, మధ్యతరగతి అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇన్‌కంట్యాక్స్‌ శ్లాబ్‌లలో మార్పులతో ఉద్యోగులకు ప్రయోజనకరం. మొత్తంగా బడ్జెట్‌ ఫుల్‌ మీల్స్‌ పెట్టినట్టుగా ఉంది. మెడికల్‌ సీట్లు పెంచినారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ప్రజల కొనుగోలు శక్తి పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా బడ్జెట్ ఉంది. బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.


Next Story

Most Viewed