8 ఎకరాలు కొని 20 ఎకరాలు కబ్జా!

by D.Reddy |
8 ఎకరాలు కొని 20 ఎకరాలు కబ్జా!
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : పూడూర్ మండలం ఎన్కెపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో నూతనంగా వెలిసిన మైరాన్ హోమ్స్ వెంచర్ యజమాని 8ఎకరాలు కొని 20ఎకరాల భూమికి ఏతం వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై బాధితులు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఎస్పీ నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రంలో ఎన్కెపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 115 లో మా తాతల ఆస్తిగా 20.08ఎకరాల ఇనామ్ భూమి వచ్చింది. వారిలో నలుగురు రైతులు తమ వంతుగా వచ్చిన 8 ఎకరాల భూమిని మైరాన్ హోమ్స్ వెంచర్ యజమానులకు అమ్ముకున్నారు. రికార్డ్ ప్రకారం అమ్ముకున్న మాకు చెందిన భూమిని ఇప్పటివరకు ఎవరిది వారికీ పంచుకోలేదు. దానికోసం సర్వేకు పెట్టుకున్న అధికారులు సర్వేకు సహకరించడం లేదు. అంతలోనే వెంచర్ నిర్వాహకులు రాత్రి సమయంలో దాదాపు 60 మందితో వచ్చి పెన్సింగ్ వేశారు. మేము అడ్డుకుంటే రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారు. కావున మైరాన్ హోమ్స్ వెంచర్ యజమానులు, అందులో పనిచేసే వర్కర్ల నుండి మాకు ప్రాణ హాని ఉందని, దయచేసి వారి నుండి మమ్మల్ని కాపాడి, బాధ్యులమైన మాకు చెందిన 12 ఎకరాల 28 గుంటల భూమిని మాకు ఇప్పించండి అని ఎన్కెపల్లి గ్రామానికి చెందిన భీమయ్య, మాన్నెగూడ పెంటయ్య తండ్రి లాలయ్య, కంతల విజయ్ కుమార్ తండ్రి భీమయ్య, నల్లల్లో బుజ్జమ్మ భర్త చంద్రయ్య ఇతర రైతులు అదనపు కలెక్టర్ కు, ఎస్పీ కి పిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే మైరాన్ హోమ్స్ వెంచర్ నిర్వాహకులు మాత్రం మేము చట్ట ప్రకారమే అందరి దగ్గర భూములు కొని రిజిస్ట్రేషన్ చేసుకొని వెంచర్ చేస్తున్నామని, ప్రభుత్వం నుండి కూడా అన్ని అనుమతులు వచ్చాయని చెబుతున్నారు. మా వెంచర్ కు డిటిసిపితో పాటు రేరా అనుమతులు కూడా ఉన్నాయని వెల్లడించారు.

నామరూపాలు లేకుండా నాలాల మాయం..

2024 జులై నెలలో డీటీసీపీ అనుమతులు తీసుకున్న మైరాన్ హోమ్స్ వెంచర్ కు జిల్లా నుండి రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయితీ రాజ్ ఇతర సంబంధిత అన్ని శాఖల నుండి ఎన్.ఓ.సి లు తీసుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న అనుమతులకు వారు ప్రభుత్వానికి పంపిన మాస్టర్ ప్లాన్ తో పాటు ఎన్కెపల్లి గ్రామం విలేజ్ మ్యాప్ లో ఉన్న నక్ష బాటను నామరూపాలు చేయడం గమనార్హం. వెంచర్ మొత్తాన్ని మట్టితో మూయడం, చుట్టూ పెన్సింగ్ గేటు నిర్మించి నక్ష బాట అనేది లేకుండా చేశారని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగిన ఎన్.ఓ.సి ఇచ్చి ఆఫీస్ లో కూర్చున్న రెవెన్యూ అధికారులు ఇటువైపు రావడం లేదు. అలాగే ఎన్కెపల్లి నుండి శివారెడ్డి పెట్ చెరువులో కలిసే వాగును సైతం పైపులు వేసి చాలా వరకు కబ్జా చేయడమే గాక, పక్కనే ఉన్న మరో చిన్న నాలాను మట్టిపోసి నామరూపాలు లేకుండా చేశారు. అయినా కూడా సంబంధిత అధికారులు ఎవరు కూడా ఇటువైపు రావడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నా భూమిలో దౌర్జన్యంగా రోడ్డు వేస్తుండ్రు

కంతల విజయ్ కుమార్, ఎన్కెపల్లి

సర్వే నెంబర్ 115 లో మా కుటుంబానికి ఎకరం ఇనామ్ భూమి ఉంది. దాంట్లో నుండి మా పెద్ద నాన్నకు చెందిన 20 గుంటల భూమిని మైరాన్ హోమ్స్ వారికి అమ్మాడు. మాకు మాత్రం 20గుంటల మా భూమి అమ్మడం ఇష్టం లేదు. ఈ భూమే మాకు ఆధారం అలాంటి భూమిలో మైరాన్ హోమ్స్ వెంచర్ యజమానులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నరు. గతంలో సర్వేకు పెట్టాం. కానీ వారు అధికారులను మేనేజ్ చేసి సర్వే కాకుండా ఆపేశారు. నేను ఎదురు తిరిగితే అమ్మితే నీ భూమి అమ్ము, లేదంటే ఏం చేసుకుంటావో చేసికో అని బెదిరిస్తుండ్రు.

మా భూమి ఎవ్వరికీ అమ్మలే

- నల్లల్లో బుజ్జమ్మ, ఎన్కెపల్లి

ఎన్కెపల్లి సర్వే నెంబర్ 115 లో మాకు చెందిన మొత్తం 20.28ఎకరాల ఇనామ్ భూమి అర్జన్ బాలయ్య అనే రైతు పేరుపై ఉంది. అందులో నుండి మా మామ నల్లోల్ల ఎల్లయ్యకు 20 గుంటల భూమి రావాల్సి ఉంది. మాకు చెందిన భూమి ఎవ్వరికి అమ్మలేదు. ఎక్కడ మా వారసులు నేను సంతకాలు చేయలేదు. కానీ మా భూమిని కూడా వెంచర్ యజమానులు కబ్జా చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీ భూమికి సంబంధించిన పత్రాలు తీసుకొని రండి అంటూ బెదిరిస్తున్నారు.

నాలా మూసివేస్తే చర్యలు

రేణుక, చేవెళ్ల ఇరిగేషన్ ఈఈ

సాధారణ నాలాతో పాటు అటుగా వెళ్లే ప్రధాన వాగును ఎలాంటి డిస్ట్రబ్ చేయము అని చెప్పడంతోనే వెంచర్ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ నుండి ఎన్.ఓ.సి ఇచ్చాం. అలాగాక నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సదురు వెంచర్ ను ఫీల్డ్ విజిట్ చేయమని డీఈని ఆదేశిస్తాం. అందులో ఎలాంటి కబ్జా జరిగినట్లు వెల్లడైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.


Next Story

Most Viewed