- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మట్టి మాఫియా.. యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు..

దిశ, చందుర్తి : మట్టి మాఫియా అడ్డూ అదుపూ లేకుండా కార్యకలాపాలు సాగిస్తోంది. మట్టి అక్రమ తవ్వకాలతో రూ.లక్షల్లో దండుకుంటున్నారు. చందుర్తి మండలంలో ఓ రైతు పొలం నుంచి అధికారుల అనుమతులు లేకుండా ప్రతిరోజూ వేల రూపాయల విలువైన మట్టి రవాణా జరుగుతుంది. ధనార్జనే ధ్యేయంగా సామాన్యుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సామాన్యులను దోపిడీ చేస్తున్నారు. నూతన గృహ నిర్మాణాలకు ఈ మట్టిని ఉపయోగిస్తుంటారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని వారి దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. రైతులకు ఒక ట్రిప్పుకు రూ.100 నుంచి రూ.150 వరకు చెల్లించి.. సామాన్యుల చెంత రూ.500ల నుంచి రూ.700 వరకు పైసలు కాజేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా రూ.లక్షల విలువైన మట్టిని తరలిస్తున్నారు.
అధికారులు మాత్రం తమకు ఫిర్యాదు అందలేదంటూ తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొద్ది నెలలుగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మట్టి వ్యాపారులు అధికారులను, రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని తమకు ఎదురే లేదన్న ధోరణిలో తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాల పై పత్రికల్లో కథనాలు వెలువడుతున్నా ఏ స్థాయిలోనూ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని కొందరు వ్యాపారులు తమను ఎవరూ నియంత్రించలేరన్న ధీమాను ప్రదర్శిస్తున్నారు. మట్టి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుండటంతో ఆ వ్యాపారం వైపు ఇటీవల చాలా మంది మక్కువ చూపుతున్నారు.
నియంత్రణ లేని వాహనాల అతివేగం..
మట్టి అక్రమ రవాణా చేసే ట్రాక్టర్ల వేగానికి ఇతర వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువ ట్రిప్పులు పోయాలని అత్యుత్సాహంతో అత్యంత వేగంగా ట్రాక్టర్లను నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతాయనే ఆరోపణలు, ఆందోళన వ్యక్తమవుతుంది. మట్టి రవాణా చేసే పలు ట్రాక్టర్లకు కనీసం సరైన డాక్యూమెంట్స్ కూడా లేవనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వాహనాలకు సంబందించిన ఇన్సూరెన్స్ పత్రాలు కూడా లేకపోవడంతో ప్రమాద సమయంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఫిట్‌నెస్ లేని వాహనాలను కూడా మట్టి రవాణాకు వినియోగిస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు, వారి డ్రైవింగ్ లైసెన్సులను సరి చూసి, వారి దగ్గర సరియైన పత్రాలు లేని ఎడల వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారిని పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఇటు అధికారులు, అటు రాజకీయ నాయకుల అండదండల నేపథ్యంలో అక్రమ మట్టి వ్యాపారం భారీ స్థాయిలో కొనసాగుతోందిని ఆరోపణలు లేకపోలేదు.
శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.. డిప్యూటీ తహశీల్దార్ శ్రీలత..
మట్టి రవాణాకు మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. సొంత భూమిలో నుంచి మట్టిని తీయడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పర్మిషన్ తహశీల్దార్ కార్యాలయం నుంచి ఇవ్వలేదు. వారి పైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా మట్టి అక్రమ రవాణా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.