- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Warangal: భారీగా సీఎంఆర్ పెండింగ్.. మిల్లర్లపై చర్యలేవి..?

దిశ, వరంగల్ బ్యూరో : కస్టమ్ మిల్లింగ్ రైస్ తిరిగి ఇవ్వడంలో మిల్లర్లు మొండికేస్తున్నారు. రెండేళ్లుగా తాము ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వకుండా మిల్లర్లు దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారు. మొండి బకాయిదారులపై చర్యలు తీసుకోవాల్సిన సివిల్ సప్లయ్ అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. గడువు ముగిసినా ప్రతీ సారి కొత్తగా గడువు విధిస్తూ మిల్లర్లకు శక్తివంచన లేకుండా సహాయ సహకరాలు అందజేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మూడు, నాలుగు సార్లు గడువు ఇచ్చినప్పటికీ రైస్‌మిల్లర్లు మాత్రం సీఎంఆర్ ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జనవరి 31 వరకు మొత్తం సీఎంఆర్ తిరిగి చెల్లించాలంటూ ఇటీవలే ప్రభుత్వం మిల్లర్లను స్పష్టంగా హెచ్చరించింది. 2023-24 సంవత్సరం రబీ సీజన్ నుంచి ఇటీవలే ముగిసిన ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పెద్ద మొత్తంలో సీఎంఆర్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మిల్లర్లు మిల్లింగ్ కెపాసిటీ, ఇతరత్రా సాంకేతిక కారణాలను చూపుతూ దాటవేస్తుండడం గమనార్హం.
రూ.80కోట్ల విలువ చేసే బకాయిలు..!
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు పదిహేను మిల్లుల నుంచి రూ.80కోట్లకు పైగా విలువ చేసే సీఎంఆర్ రావాల్సి ఉందని సివిల్ సప్లయ్ అధికారుల నుంచి తెలుస్తుండటం గమనార్హం. 2023-24 యాసంగి, 2024- రబీ కేటాయింపు కలుపుకుంటే ఈ మొత్తం మరో రూ.10 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సీఎంఆర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లపై జరిమానాలు, కేసులు విధిస్తున్నా వారి తీరు మారడం లేదు. ప్రతీ సీజన్‌లో ప్రభుత్వమే రైతుల నుంచి మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుపుతోంది. ధాన్యాన్ని జిల్లాలో ఉన్న మిల్లులకు కేటాయిస్తే మిల్లర్లు సీఎంఆర్ చేసి తిరిగి అందించాలి. బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తే రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అయితే ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు బియ్యం ఇవ్వడం లేదు.
ఆర్ ఆర్ యాక్టు అమలుకు దూరం..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాయిల్డ్ మరియు రా రాస్ మిల్లులు 328 వరకు ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాలోని మిల్లుల నుంచి 2022-23కు సంబంధించిన బకాయిలు సుమారు లక్షా20వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు సీఎంఆర్ బకాయి రావాల్సి ఉంది. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఆయా మిల్లుల్లో సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీల్లో అసలు ధాన్యమే లేకపోవడం గమనార్హం. సదరు మిల్లులపై కేసులు నమోదు చేసి ఆర్ ఆర్ యాక్టు ప్రయోగించాల్సి ఉండగా అధికారులు ఆ దిశగా అడుగులు వేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రికవరీ విషయంలో పలుసార్లు నోటీసులు అందుకున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ, నిర్లక్ష్యవైఖరి కారణంగా మిల్లర్లు ఆ నోటీసులకు సమాధానాలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. రైస్‌మిల్లర్లు వ్యూహాత్మకంగా సిండికేట్ గా మారి రబీబియ్యాన్ని ఖరీఫ్‌కు, ఖరీఫ్ బియ్యాన్ని మళ్లీ రబీకి ఇలా వరుసగా చేతులు మార్చి తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాయి.